జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల
పెండింగ్ బిల్లుల చెల్లింపుకు గ్రీన్ ఛానల్
కాకతీయ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది. గ్రామపంచాయతీలకు రూ.389 కోట్లు, ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు రూ.745 కోట్లు విడుదల చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఉద్యోగుల బకాయిల చెల్లింపులో భాగంగా ఫిబ్రవరి నెలకు సంబంధించిన బిల్లుల విడుదలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు విడుదల చేసింది. ప్రతి నెలా కనీసం రూ.700 కోట్లకు తగ్గకుండా పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం ఇచ్చిన హామీని కొనసాగిస్తోంది. గత జూన్ నెలాఖరులో రూ.183 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం, ఆ తర్వాత గత సంవత్సరం ఆగస్టు నుంచి ప్రతి నెల కనీసం రూ.700 కోట్ల చొప్పున విడుదల చేస్తూ వస్తోంది. తాజాగా విడుదల చేసిన రూ.745 కోట్లలో గ్రాట్యుటీ, జీపీఎఫ్, సరెండర్ లీవ్, వివిధ అడ్వాన్సులు వంటి బిల్లులు ఉన్నాయి.
అదేవిధంగా గ్రామపంచాయతీల అభివృద్ధి పనులకు సంబంధించిన బకాయిల చెల్లింపునకు రూ.389 కోట్లు విడుదల చేయడం ద్వారా స్థానిక సంస్థలకు ఊరటనిచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ ముందుకు సాగుతోందని తెలిపారు.


