పదోన్నతులు కల్పించాలి
టీ పీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల ఉప్పస్వామి, పల్లె నాగరాజు
కాకతీయ, ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం ఐటీడీఏ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో పని చేస్తున్న తెలుగు, హిందీ, వ్యాయమ ఉపాధ్యాయులను ఉన్నతికరించి, పదోన్నతులు కల్పించాలని తెలంగాణ ప్రోగ్రెస్సివ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల ఉప్పస్వామి, పల్లె నాగరాజు డిమాండ్ చేశారు. శనివారం ఆశ్రమ పాఠశాలలో సమస్యల పరిష్కారం కోసం ఏటూరునాగారం ఐటీడీఏ అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్‌కు మెమోరాండం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో పని చేస్తున్న కాంట్రాక్టు రెసిడెంట్స్ టీచర్స్ ను రెగ్యులరైజ్ చేసి కనీస వేతనం చెల్లించాలన్నారు. వీటితో పాటు కన్వర్టెడ్ ఆశ్రమ పాఠశాలలను 10 వ తరగతి వరకు అప్గ్రేడ్ చెయ్యాలన్నారు. 317 జీవో ద్వారా స్థానికతను కోల్పోయిన ఉపాధ్యాయులకు న్యాయం చెయ్యాలన్నారు. వసతి గృహలకు ప్రత్యేకంగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్ట్ లను మంజూరు చెయ్యాలన్నారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల సమస్యల పరిష్కారం కోసం మార్చి 10న గిరిజన సంక్షేమ కమిషనర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీపీటీఎఫ్ నాయకులు బడుగు రాజు, భూక్యా సారంగపాణి పాల్గొన్నారు.


