- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అధిక ప్రాధాన్యం
- ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి
కాకతీయ, కొత్తగూడెం రూరల్: కాంగ్రెస్ పార్టీ విస్తరణకు కష్టపడిన వారికే పదవులు దక్కుతాయని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి అన్నారు. ఏఐసీసీ ఆదేశానుసారం పిసిసి సూచనలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ఎంపిక దరఖాస్తుల స్వీకరణకు గురువారం కొత్తగూడెం క్లబ్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి ఎంపీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు ముందు కలిసికట్టుగా పనిచేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల కృషిని ఎప్పటికీ మరువబోమని, ఇదే ఐక్యతతో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ముందుకెళదామని ఎంపీ అన్నారు. డీసీసీ అధ్యక్షుల ఎంపిక కోసం ఏఐసీసీ అబ్జర్వర్, ఎంపీ రఘురాం రెడ్డి సమక్షంలో పలువురు నాయకుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. పార్టీ శ్రేణుల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఏఐసిసి అబ్జర్వర్ జాన్సన్ అబ్రహం మాట్లాడుతూ.. గతంలో ఏ పార్టీ కూడా ఇలాంటి ఎంపిక ప్రక్రియ నిర్వహించలేదని, అర్హులకు పదవులు దక్కాలని కాంగ్రెస్ తొలి అడుగు వేసిందని అన్నారు. దరఖాస్తుల ఆధారంగా జాబితాను పిసిసికి అందజేస్తామని అనంతరం డిసిసి అధ్యక్షుడి ఎంపిక ఉంటుందని ప్రకటించారు. కార్యక్రమంలో పీసీసీ అబ్జర్వేషన్ కార్యవర్గ సభ్యులతో, పార్టీ జిల్లా అధ్యక్షుడు పొదేం వీరయ్య, పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


