పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలి
ఏసీపీ విజయ్ కుమార్
గంగాధర పోలీస్ స్టేషన్ తనిఖీ
కాకతీయ, కరీంనగర్ : పెండింగ్ కేసులను వేగవంతంగా పరిష్కరించి ప్రజలకు పారదర్శక సేవలు అందించాలని కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ సూచించారు. ట్రైనీ ఐపీఎస్ అధికారి సోహంతో కలిసి శనివారం గంగాధర పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈసందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలు, పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, మాల్ఖానా వ్యవస్థ, సిబ్బంది విధుల నిర్వహణ తదితర అంశాలను సమీక్షించారు. స్టేషన్‌లో అమలులో ఉన్న 5ఎస్ విధానాన్ని పరిశీలించి మరింత సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. స్టేషన్ పరిధిలో సీజ్ చేసిన వాహనాల సంరక్షణ, రికార్డు నిర్వహణ, కోర్టు కేసులకు సంబంధించిన విధానాలను పరిశీలించారు. 2023, 2024, 2025 సంవత్సరాలకు సంబంధించిన నమోదైన కేసులు, పెండింగ్ కేసులు, డిస్పోజల్ శాతం, దర్యాప్తు పురోగతిపై సమగ్ర సమీక్ష చేపట్టి పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలకు వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందించడంలో పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, శాంతిభద్రతల పరిరక్షణలో బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్‌ఐ వంశీకృష్ణ, గన్నేరువరం ఎస్‌ఐ నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


