భూ భారతి కాదు…భూ దోపిడీ!
కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త పోర్టల్
ఆపరేటర్ల అరెస్టులు నాటకమే… అసలు పెద్దలపై చర్యలేదు
37 మండలాల్లో భూ భారతి కుంభకోణం దర్జాగా నడుస్తోంది
నిషేధిత జాబితాపై శ్వేతపత్రం విడుదల చేయాలి
సిట్ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపించాలి
నిషేధిత భూముల పేరుతో యథేచ్ఛగా వసూళ్లు నడుస్తున్నాయి
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఉపనేత హరీష్‌రావు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : భూ భారతి కాదు… అది భూ దోపిడీ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఉపనేత హరీష్‌రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ధరణిని రద్దు చేసి ఎంతో పారదర్శక వ్యవస్థ తీసుకొచ్చామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు భూ భారతి పోర్టల్‌ను అక్రమాల అడ్డాగా మార్చిందని ఆరోపించారు. ఈ భారీ కుంభకోణంపై వెంటనే సిట్ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జనగామలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో హరీష్‌రావు మాట్లాడుతూ… రెవెన్యూ వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని, రైతులను మోసం చేస్తోందని ఆరోపించారు. ధరణి పోర్టల్‌లో లోపాలున్నాయంటూ విమర్శలు చేసిన కాంగ్రెస్ నేతలు, భూ భారతి తీసుకొచ్చిన తర్వాత జరుగుతున్న అక్రమాలపై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.
37 మండలాల్లో కుంభకోణం?
వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లలో భూ భారతి పోర్టల్‌లోని ఎడిటింగ్ సౌకర్యాన్ని దుర్వినియోగం చేసి, పూర్తి రిజిస్ట్రేషన్ రుసుము వసూలు చేసినప్పటికీ కేవలం 10 శాతం మాత్రమే ప్రభుత్వ ఖజానాకు జమ చేసి, మిగతా 90 శాతం దళారులు, సంబంధిత వ్యక్తులు జేబుల్లో వేసుకున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారం 37 మండలాల్లో దర్జాగా సాగుతుంటే కూడా నిఘా వ్యవస్థలు గుర్తించకపోవడం ప్రభుత్వ వైఫల్యమని అన్నారు. విలేకరులు బయటపెట్టిన తర్వాతే ప్రభుత్వం స్పందించిందని, ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రికి ముందుగా ఈ కుంభకోణం గురించి తెలియకపోవడం ఆశ్చర్యకరమని వ్యాఖ్యానించారు. అసలు ఈ వ్యవహారంలో ఉన్న పెద్ద తలకాయలను కాపాడేందుకే కేవలం ఆపరేటర్లను అరెస్ట్ చేసి కేసులు నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.
నిషేధిత భూముల పేరుతో వసూళ్లు
నిషేధిత జాబితాలో లక్షల ఎకరాలను ఉద్దేశపూర్వకంగా చేర్చి, వసూళ్లు పూర్తయిన తర్వాత వాటిని తొలగించడం ప్రభుత్వానికి నిత్యకృత్యంగా మారిందని హరీష్‌రావు విమర్శించారు. ప్రస్తుతం ఆ జాబితా కోటి ఎకరాలు దాటిందని, హైకోర్టు మొట్టికాయలు వేసినా ప్రభుత్వ తీరు మారలేదని అన్నారు. వెంటనే నిషేధిత జాబితాలో ఎన్ని భూములు చేర్చారో వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో 6 లక్షల 18 వేల మంది రైతులకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా సాదా బైనామాలు చేసి పాస్ పుస్తకాలు ఇచ్చామని గుర్తుచేశారు. రెండో విడతలో 8 లక్షల 92 వేల మంది రైతులు దరఖాస్తు చేసుకున్నప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా బాండ్ పేపర్‌పై అఫిడవిట్ నిబంధన పెట్టి సాదా బైనామాలకు ఉరితాడు బిగించిందని ఆరోపించారు. ఆ నిబంధన కారణంగా ఇప్పటివరకు ఒక్క రైతుకూ లబ్ధి కాలేదని తెలిపారు. వెంటనే ఆ నిబంధనను రద్దు చేసి పెండింగ్‌లో ఉన్న రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రిజిస్ట్రేషన్ సమయంలో పాస్ పుస్తకాల కోసం రూ. 300 వసూలు చేస్తున్నప్పటికీ, నెలలు గడిచినా పాస్ పుస్తకాలు ఇవ్వడం లేదని, పాస్ పుస్తకం లేక ఎరువులు, బ్యాంకు రుణాలు పొందలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఆన్లైన్ వ్యవస్థలు, కొత్త సాఫ్ట్వేర్ పేరుతో వ్యవహారం గందరగోళంగా మారిందని విమర్శించారు.
రైతుబంధు… ధరల భారం..!
రైతుబంధు విషయంలోనూ ప్రభుత్వం ఓట్ల రాజకీయాలకే పరిమితమైందని హరీష్‌రావు ఆరోపించారు. కేసీఆర్ హయాంలో నాట్లకు ముందే రైతుబంధు వచ్చేదని, ఇప్పుడు మాత్రం ఎన్నికలు ఉంటేనే రైతుబంధు వేస్తారని విమర్శించారు. అసైన్డ్ భూముల విషయంలో పేదలకు ఇచ్చిన భూములను గుంజుకున్నారని, ధరల పెంపు, ఆర్టీసీ ఛార్జీల పెంపు వంటి నిర్ణయాలతో సామాన్యుడిపై భారం మోపుతున్నారని ఆరోపించారు. సాగర్, శ్రీశైలం జలాల వినియోగంలోనూ ప్రభుత్వం వైఫల్యం చెందిందని, ఆంధ్రప్రదేశ్ నీటిని మళ్లిస్తుంటే అడ్డుకోలేకపోతున్నదని విమర్శించారు. ఇరిగేషన్ శాఖ పూర్తిగా విఫలమైందని అన్నారు. ఈ భూ భారతి కుంభకోణంపై తక్షణమే సిట్ వేసి పూర్తి స్థాయి దర్యాప్తు జరిపించాలని, ప్రభుత్వ ఖజానాకు జరిగిన నష్టాన్ని ప్రతి పైసా వసూలు చేయాలని హరీష్‌రావు స్పష్టం చేశారు. “ధరలు పెంచడం, కమీషన్లు దంచుకోవడం తప్ప ఈ ప్రభుత్వానికి ఇంకేమీ రాదు” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


