నామమాత్రంగా సామాజిక తనిఖీ ఓపెన్ ఫోరం
సిబ్బంది తప్ప జనం లేని ప్రజా వేదికపై విమర్శలు
కాకతీయ, కారేపల్లి: ఖమ్మం జిల్లా సింగరేణి కారేపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన ఉపాధి హామీ పనుల సామాజిక తనిఖీ ప్రజా వేదిక కార్యక్రమం నామమాత్రంగా సాగింది. కార్యక్రమానికి డీఆర్డీఓ అదనపు పీడీ శ్రీదేవి హాజరయ్యారు.
మండలంలోని పంచాయతీలలో 2024 ఏప్రిల్ ఒకటి నుండి 2025 మార్చి 31 వరకు జరిగిన పనులపై 17వ విడత సామాజిక తనిఖీ నిర్వహించారు. ఈ ఏడాది మొత్తం 561 పనులను పరిశీలించగా, అందులో ఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద 469 పనులు, పంచాయతీరాజ్ కింద 91 పనులు, మన ఊరు-మన బడి కింద ఒక పని ఉన్నట్లు వెల్లడించారు. కూలీలు, మెటీరియల్ వ్యయాలతో కలిపి సుమారు తొమ్మిది కోట్ల ముప్పై రెండు వేల మూడు వందల తొంభై రెండు రూపాయల నిధులు వినియోగించినట్లు తెలిపారు.
వారం రోజులుగా తనిఖీ బృందం గ్రామాల్లో పర్యటించి కూలీలతో మాట్లాడి, పనులను పరిశీలించి, అవినీతి అంశాలపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. పనులలో జరిగిన తప్పిదాలపై సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్ నుంచి రికవరీ చేపట్టాల్సి ఉందని తెలిపారు.

అయితే ప్రజా వేదికకు అధికారులు, ఉపాధి సిబ్బంది తప్ప ప్రజలు హాజరుకాకపోవడం విమర్శలకు దారితీసింది. తనిఖీ వివరాలను గోప్యంగా ఉంచి నివేదికలు తయారు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బహిరంగ ప్రదేశంలో ప్రజల సమక్షంలో ఓపెన్ ఫోరం నిర్వహించాలని సిపిఎం జిల్లా నాయకుడు కొండబోయిన నాగేశ్వరావు డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎంపీఓ మల్లెల రవీంద్ర ప్రసాద్, అంబుడ్స్‌మన్ రమేశ్ బాబు, విజిలెన్స్ అధికారులు, క్వాలిటీ కంట్రోల్ సిబ్బంది, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.


