సర్పంచ్‌లకు కొత్త అధికారాలు
అంగన్‌వాడీ కేంద్రాల పర్యవేక్షణ బాధ్యత సర్పంచ్‌లకే
పౌష్టికాహార పంపిణీలో అక్రమాలకు చెక్
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : తెలంగాణ రాష్ట్రంలో అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణలో కీలక మార్పులు చేపట్టింది ప్రభుత్వం. ఇకపై గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతలను పూర్తిగా సర్పంచ్‌లకే అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్‌వాడీల్లో పౌష్టికాహారం పంపిణీ, చిన్నారుల సంరక్షణ, గర్భిణీలకు పోషకాహారం అందజేయడంలో జరుగుతున్న నిర్లక్ష్యాన్ని అరికట్టడమే ఈ నిర్ణయ లక్ష్యమని అధికారులు తెలిపారు. సర్పంచ్ ఛైర్మన్‌గా 11 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి, అంగన్‌వాడీల పనితీరు, నాణ్యత ప్రమాణాలను ఈ కమిటీ నేరుగా పర్యవేక్షించనుంది. గత రెండేళ్లుగా గ్రామాల్లో ఎన్నికైన పాలకవర్గాలు లేకపోవడంతో పర్యవేక్షణ వ్యవస్థ బలహీనపడిందని ప్రభుత్వం గుర్తించింది. అనేక ప్రాంతాల్లో పౌష్టికాహారం పక్కదారి పడుతున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన పంచాయతీ పాలకవర్గాలకు ఈ బాధ్యతలు అప్పగించడం ద్వారా వ్యవస్థను బలోపేతం చేయాలని నిర్ణయించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఐదు నియోజకవర్గాల్లో మొత్తం 2061 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా, ఇవన్నీ ఇకపై సర్పంచ్‌ల ఆధ్వర్యంలోని కమిటీల పర్యవేక్షణలో పనిచేయనున్నాయి.


