ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్ బోణీ
నమీబియాపై 7 వికెట్ల తేడాతో విజయం
ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రాణించిన బాస్ డి లీడే
కాకతీయ, స్పోర్ట్స్ డెస్క్: టీ20 వరల్డ్‌కప్‌లో నెదర్లాండ్స్ బోణీ కొట్టింది. దిల్లీ వేదికగా నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో నెగ్గింది. నమీబియా నిర్దేశించిన 157 పరుగుల లక్ష్యాన్ని నెదర్లాండ్స్ 3 వికెట్లు కోల్పోయి 18 ఓవర్లలోనే ఛేదించింది. నెదర్లాండ్స్ బ్యాటర్లలో బాస్ డి లీడే (72 పరుగులు, 48 బంతుల్లో) హాఫ్ సెంచరీతో అదరగొట్టగా, కొలిన్ (32 పరుగులు), మైకెల్ లెవిట్ (28 పరుగులు) రాణించారు. నమీబియా బౌలర్లలో బెర్నాండ్, రుబెన్, జాన్ నికొల్ తలో 1 వికెట్ దక్కించుకున్నారు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన నెదర్లాండ్ ప్లేయర్ బాస్ డి లీడేకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 156 పరుగులు చేసింది. జాన్ నికొల్ (42 పరుగులు) టాప్ స్కోరర్. జాన్ ఫ్రైలింక్ (30 పరుగులు), జేజే స్మిత్ (22 పరుగులు) రాణించారు. కెప్టెన్ ఎరాస్మస్ (18 పరుగులు, 9 బంతుల్లో) వేగంగా ఆడే క్రమంలో ఔటయ్యాడు. మిగిలిన బ్యాటర్లు స్టీన్కాంప్ (6 పరుగులు), జేనె గ్రీన్ (9 పరుగులు), రుబెన్ (9 పరుగులు), లీచర్ (6 పరుగులు), విల్లెమ్ (4 పరుగులు) విఫలమయ్యారు. నెదర్లాండ్స్ బౌలర్లలో వాన్ బీక్, బాస్ డి లీడ్ చెరో 2, క్లాసిన్, ఆర్యన్ దత్ చెరో 1 వికెట్ దక్కించుకున్నారు.


