నారాయణ హాస్టల్‌లో డ్రగ్స్ కలకలం
మత్తులో ఇద్దరు విద్యార్థుల దాడి… ఇంటర్ విద్యార్థి తీవ్ర గాయాలు
డ్రగ్స్ తీసుకుని తోటి విద్యార్థిపై విచక్షణ రహితంగా దాడి
తీవ్రంగా గాయపడిన విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స
హాస్టల్‌లో భద్రత లేకపోవడంపై తల్లిదండ్రుల ఆగ్రహం
“ఇది కామన్ విషయం” అంటూ యాజమాన్యం నిర్లక్ష్య స్పందన
ఘటన వీడియో వెలుగులోకి… మరిన్ని అనుమానాలు
అధికారుల విచారణ, కఠిన చర్యల కోసం తల్లిదండ్రుల డిమాండ్
కాకతీయ, ఖమ్మం బ్యూరో : సొంత గొప్పలు చెప్పుకునే నారాయణ విద్యాసంస్థలో జరుగుతున్న దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఖమ్మం జిల్లా కేంద్రంలోని నారాయణ కళాశాల హాస్టల్‌లో డ్రగ్స్ మత్తులో ఉన్న ఇద్దరు ఇంటర్ విద్యార్థులు తోటి విద్యార్థిపై విచక్షణ రహితంగా దాడి చేయడం సంచలనంగా మారింది. ఈ ఘటనలో మామిడాల విశాల్ అనే విద్యార్థి తీవ్రంగా గాయపడి గత రెండు రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఇద్దరు విద్యార్థులు డ్రగ్స్ తీసుకుని మత్తులో విచక్షణ కోల్పోయి విశాల్‌పై పిడిగుద్దులతో దాడి చేసినట్లు సమాచారం. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఇతర విద్యార్థులపై కూడా దాడికి పాల్పడటంతో హాస్టల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గాయపడిన విశాల్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నప్పటికీ, అతని ఆరోగ్య పరిస్థితిపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హాస్టల్‌లో భద్రత గాలికి… వీడియోతో వెలుగులోకి ఘటన
దాడి జరిగిన సమయంలో హాస్టల్‌లో వార్డెన్, వాచ్‌మెన్, భద్రతా సిబ్బంది లేకపోవడం తీవ్ర నిర్లక్ష్యాన్ని సూచిస్తోంది. లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయల వరకు ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ కనీస భద్రతా ఏర్పాట్లు లేకపోవడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు డ్రగ్స్, మద్యం వంటి వ్యసనాలకు గురవుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనను మరో విద్యార్థి రహస్యంగా వీడియో తీసినట్లు సమాచారం. వీడియో బయటకు రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కళాశాల యాజమాన్యాన్ని ప్రశ్నించిన తల్లిదండ్రులకు “ఇది కామన్ విషయమే… చిన్న విషయాన్ని పెద్దగా చేయొద్దు” అంటూ నిర్లక్ష్యంగా స్పందించినట్లు ఆరోపిస్తున్నారు. గాయపడిన విద్యార్థి తల్లిదండ్రులను పరీక్షల హాల్ టికెట్ విషయంలో బెదిరించినట్లు కూడా సమాచారం. మీడియా ప్రతినిధులు సమాచారం కోసం కళాశాలకు వెళ్లినప్పుడు కూడా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలిసింది.
విద్యార్థుల భద్రత విషయంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, హాస్టళ్లలో డ్రగ్స్ వినియోగంపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.


