కేడీసీలో మెగా జాబ్ డ్రైవ్
140 మందికి ఉద్యోగ అవకాశాలు
కాకతీయ, హనుమకొండ : కాకతీయ ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాలలో నిర్వహించిన మెగా జాబ్ డ్రైవ్ విజయవంతంగా ముగిసింది. టీఎస్‌కేసీ, కళాశాల ప్లేస్‌మెంట్ సెల్ ఆధ్వర్యంలో మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ సహకారంతో ఈ ప్రత్యేక నియామక కార్యక్రమం నిర్వహించారు. ఈ జాబ్ డ్రైవ్‌కు పలు ప్రముఖ సంస్థలు హాజరై విద్యార్థులను ఎంపిక చేయగా, మొత్తం 140 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. కార్యక్రమానికి మొత్తం 390 మంది విద్యార్థులు ఇంటర్వ్యూలకు హాజరుకావడం విశేషం. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం, మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ మధ్య విద్యార్థుల ఉపాధి అవకాశాలను మెరుగుపరచే లక్ష్యంతో అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది. భవిష్యత్తులో మరిన్ని ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లు నిర్వహించేందుకు ఈ ఒప్పందం తోడ్పడనుంది. ఎంపికైన అభ్యర్థులకు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి. శ్రీనివాస్ ఆఫర్ లెటర్లను అందజేశారు. విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ప్రిన్సిపాళ్లు, ప్లేస్‌మెంట్ సెల్ అధ్యాపకులు, మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.


