మానుకోటలో దొంగ బంగారం దందా?
నకిలీ బంగారంతో వినియోగదారులకు కుచ్చుటోపి
ఇతర రాష్ట్రాల చోరీ బంగారం ఇక్కడే కరిగింపు, విక్రయాలు
గతంలో ఇదే అంశంపై తీవ్రంగా చర్చ.. తాజాగా మళ్లీ కలకలం
అధికారుల మౌనంపై జనంలో పెరుగుతున్న అనుమానాలు
కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : మహబూబాబాద్ జిల్లా కేంద్రం మానుకోటలో నకిలీ బంగారం, దొంగ బంగారం దందా మళ్లీ చర్చనీయాంశంగా మారింది. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో దొంగ బంగారంపై వినతి పత్రం అందజేయడంతో ఈ అంశం బహిర్గతమైంది. జిల్లాలో బంగారం వ్యాపారం నిర్వహించే కొందరు వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుంచి చోరీ చేసిన బంగారాన్ని కొనుగోలు చేసి, దానిని కరిగించి కొత్త ఆభరణాల రూపంలో తయారు చేసి వినియోగదారులకు 916 ప్రామానిక బంగారం అంటూ విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని వల్ల వినియోగదారులు మోసపోతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నకిలీ బంగారంతో మోసం?
ఇది తాజాగా మొదలైన వ్యవహారం కాదని, చాలా కాలంగా కొనసాగుతున్న అక్రమ దందా అని స్థానికులు చెబుతున్నారు. గతంలో అదనపు పోలీసు అధికారి స్థాయిలో కూడా ఈ అంశంపై విచారణ జరిగినప్పటికీ పూర్తిస్థాయిలో అరికట్టలేదనే ఆరోపణలు ఉన్నాయి. చోరీ బంగారాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి అధిక లాభాలతో విక్రయించడం ద్వారా కొందరు అక్రమంగా ఆస్తులు కూడబెట్టుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే దీనిపై సంబంధిత శాఖలు కఠిన చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చూపుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

గతంలో ఘటనలు.. మళ్లీ కలకలం..
రెండువేల పద్దెనిమిదిలో ఒక ఉన్నతాధికారి ఇంట్లో జరిగిన బంగారం చోరీ కేసులోనూ చోరీ చేసిన బంగారం జిల్లాలోని కొందరు షాపులకు చేరిందనే ఆరోపణలు అప్పట్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అయితే ఆ కేసు విచారణ పూర్తి స్థాయిలో జరగలేదనే వాదనలు కూడా ఉన్నాయి. తెలంగాణ సరిహద్దు ప్రాంతాల నుంచి చోరీ బంగారం మానుకోటకు చేరి ఇక్కడ కరిగింపుతో వినియోగదారులకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. జిల్లాలో ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్న పోలీసు అధికారి డాక్టర్ పి శబరీష్ కఠిన వైఖరి అవలంబిస్తారని, ఈ అక్రమాలపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటారని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దొంగ బంగారం దందాపై సమగ్ర దర్యాప్తు జరిపి వినియోగదారుల హక్కులను కాపాడాల్సిన అవసరం ఉందని సామాజిక వర్గాలు కోరుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత శాఖలు సమన్వయంతో ముందుకు వచ్చి ఈ అక్రమాలకు చెక్ పెడతాయా అన్నది వేచి చూడాల్సి ఉంది.



