మారేడిమిల్లిలో ఘెర ప్రమాదం.. 15 మంది మృతి
కాకతీయ, ఏపీ బ్యూరో : ఏపీలో మరో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో భద్రాచలం నుంచి అన్నవరం వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు లోయలో పడింది. చింతూరు నుంచి మారేడుమిల్లి వెళ్లే ఘాట్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. ఘాట్ రోడ్డులో తులసిపాకల గ్రామానికి సమీపంలో అదుపు తప్పిన బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 15 మంది ప్రయాణికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. మరికొందరికి గాయాలయ్యాయి. బస్సు ప్రమాద సమయంలో అందులో 38మంది ప్రయాణికులు ఉన్నారు. తెల్లవారు జామున 3గంటల సమయంలో ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

ఘటనాస్థలి వద్ద ప్రయాణికుల హాహాకారాలు మిన్నంటాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన ఘటన స్థలికి చేరుకొని స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.



