బిగ్ బ్రేకింగ్..!
మాజీ మంత్రి జీవన్ రెడ్డికి తీవ్ర అస్వస్థత
ఇటీవల రాజకీయ పరిణామాలతో మానసిక ఒత్తిడి
నిమ్స్‌లో చేరిక.. ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స
కాకతీయ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం ఉదయం ఆకస్మికంగా అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఫుడ్ పాయిజన్ కారణంగా జీవన్ రెడ్డికి వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా క్షీణించడంతో ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించగా, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణ
నిమ్స్‌లో ప్రత్యేక వైద్య బృందం జీవన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పరిశీలిస్తోంది. అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి, ఫుడ్ పాయిజన్ ప్రభావాన్ని తగ్గించే చికిత్స అందిస్తున్నారు. పూర్తిగా కోలుకునే వరకు వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇటీవల జగిత్యాల మున్సిపల్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో జీవన్ రెడ్డి మానసిక ఒత్తిడికి గురైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఆరోగ్యం క్షీణించడం పార్టీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది. జీవన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆకాంక్షిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై పార్టీ వర్గాలు, అభిమానులు ఆరా తీస్తున్నారు.


