ఇస్రో ప్రయోగం సక్సెస్
కక్ష్యలోకి అమెరికా బ్లూబర్డ్ బ్లాక్–2 భారీ ఉపగ్రహం
ఎల్‌వీఎం3–ఎం6 ద్వారా విదేశీ ఉపగ్రహాన్ని చేర్చిన భారత్
శ్రీహరికోట నుంచి బుధవారం ఉదయం 8.55 గంటలకు ప్రయోగం
డైరెక్ట్–టు–మొబైల్ 4జీ, 5జీ సేవలకు బ్లూబర్డ్ బ్లాక్–2 కీలకం
ఎన్‌ఎస్‌ఐఎల్–ఏఎస్టీ స్పేస్‌మొబైల్ వాణిజ్య ఒప్పందంలో భాగంగా మిషన్
అంతర్జాతీయ అంతరిక్ష వాణిజ్యంలో ఇస్రో మరో ఘనత
శ్రీహరికోట : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరోసారి తన సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటింది. భారతదేశంలో తయారైన అత్యంత శక్తివంతమైన రాకెట్ ఎల్‌వీఎం3–ఎం6 ద్వారా అమెరికాకు చెందిన తదుపరి తరం కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూబర్డ్ బ్లాక్–2ను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి బుధవారం ఉదయం 8.55 గంటలకు ఈ ప్రయోగం విజయవంతంగా జరిగింది. రాకెట్ లిఫ్ట్ ఆఫ్ అనంతరం సుమారు 15 నిమిషాల ప్రయాణంలోనే ఉపగ్రహాన్ని నిర్దేశిత లో ఎర్త్ ఆర్బిట్ ( ఎల్ఈవో)లో అత్యంత ఖచ్చితత్వంతో ప్రవేశపెట్టినట్లు ఇస్రో ప్రకటించింది. ఈ ప్రయోగంతో భారతదేశం అంతర్జాతీయ వాణిజ్య ప్రయోగాల్లో కీలక భాగస్వామిగా మరింత బలపడిందని నిపుణులు పేర్కొంటున్నారు.
అత్యంత బరువైన ఉపగ్రహం ఇదే : ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్
ఈ సందర్భంగా ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్ మాట్లాడుతూ, “భారతీయ లాంచర్ ద్వారా భారత భూభాగం నుంచి ప్రయోగించిన అత్యంత బరువైన ఉపగ్రహం ఇదే. ఉపగ్రహాన్ని లక్ష్య కక్ష్యలో ఖచ్చితంగా ప్రవేశపెట్టడం ఇస్రో శాస్త్రవేత్తల నైపుణ్యానికి నిదర్శనం” అని తెలిపారు. బ్లూబర్డ్ బ్లాక్–2 మిషన్ ప్రపంచవ్యాప్తంగా నేరుగా మొబైల్ ఫోన్లకు శాటిలైట్ ద్వారా కనెక్టివిటీ అందించేందుకు రూపొందిస్తున్న భారీ లో ఎర్త్ ఆర్బిట్ ఉపగ్రహ సమూహంలో భాగం. ఈ ఉపగ్రహాల ద్వారా భూమిపై ఎక్కడ ఉన్నా 4జీ, 5జీ వాయిస్ కాల్స్, వీడియో కాల్స్, మెసేజింగ్, డేటా, స్ట్రీమింగ్ వంటి సేవలు అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా నెట్‌వర్క్ సదుపాయాలు లేని మారుమూల ప్రాంతాలకు ఈ సాంకేతికత విప్లవాత్మక మార్పులు తీసుకురానుందని తెలిపారు.
విశ్వసనీయ లాంచ్ పార్ట్‌నర్‌గా భారత్
ఈ ప్రయోగాన్ని న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌ఎస్‌ఐఎల్)–అమెరికాకు చెందిన ఏఎస్టీ స్పేస్‌మొబైల్ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంలో భాగంగా చేపట్టారు. ఇస్రో వాణిజ్య విభాగంగా పనిచేస్తున్న ఎన్‌ఎస్‌ఐఎల్ ద్వారా భారత్ అంతరిక్ష మార్కెట్‌లో తన వాటాను వేగంగా పెంచుకుంటోంది. ఎల్‌వీఎం3–ఎం6 మిషన్, ఎల్‌వీఎం3 రాకెట్‌కు ఆరో ఆపరేషనల్ ఫ్లైట్ కాగా, బ్లూబర్డ్ బ్లాక్–2 ఉపగ్రహానికి సంబంధించి మూడవ వాణిజ్య ప్రయోగం కావడం విశేషం. చంద్రయాన్–2, చంద్రయాన్–3 వంటి చారిత్రక మిషన్లను విజయవంతంగా నిర్వహించిన ఎల్‌వీఎం3 ఇప్పటివరకు వరుసగా ఎనిమిది విజయవంతమైన ప్రయోగాలను పూర్తి చేసింది. ఈ విజయంతో అంతర్జాతీయ ఉపగ్రహ ప్రయోగ మార్కెట్‌లో భారత్ విశ్వసనీయ లాంచ్ పార్ట్‌నర్‌గా తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుందని అంతరిక్ష నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


