హామీలు అడిగితే దాడులా..? రేగళ్ల పెద్దతండాలో ఉద్రిక్తత
సర్పంచ్ అనుచరుల దాడి ఆరోపణలు
లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
బురదజల్లే ప్రయత్నమే… సర్పంచ్ వివరణ
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : ఎన్నికల హామీలు ఎక్కడివని ప్రశ్నించిన ఓటరుపై దాడి జరిగిందన్న ఆరోపణలతో రేగళ్ల పెద్దతండా గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని ఈ ఘటన మండలవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గ్రామ సర్పంచ్ లావుడియా పూర్ణచందర్రావు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఇప్పటివరకు అమలు చేయలేదని భానోత్ శ్రీను అనే గ్రామస్థుడు నిలదీశాడు. పంచాయతీ భవనం స్థలం, డ్వాక్రా మహిళల కార్యాలయం, పేదలకు పెళ్లి కానుకలు, మరణించిన కుటుంబాలకు ఆర్థిక సహాయం, రైతులకు హక్కుపత్రాలు వంటి హామీలు అమలు కాలేదని ఆరోపించాడు. “ఓటు వేసిన ఓటరుగా ప్రశ్నించే హక్కు నాకు ఉంది” అని చెప్పినందుకే సర్పంచ్ అనుచరులు తనపై దాడికి పాల్పడ్డారని వాపోయాడు. దాడిలో తాను గాయపడ్డానని, మానసికంగా వేధింపులకు గురయ్యానని పేర్కొంటూ లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దాడికి పాల్పడిన వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. ఇక ఈ ఆరోపణలను సర్పంచ్ పూర్ణచందర్రావు ఖండించారు. గెలిచి మూడు నెలలు కూడా కాలేదని, తక్షణ అభివృద్ధి సాధ్యం కాదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని, కావాలని తమపై బురదజల్లే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. గ్రామంలో నెలకొన్న ఈ వివాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.



