రూ. 1560 కోట్ల భారీ లాస్ నుంచి తప్పించుకున్న ఐసీసీ
పాకిస్థాన్ అనూహ్య నిర్ణయంతో భారీ నష్టం నుంచి బయటపడిన వైనం
కాకతీయ, స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఫిబ్రవరి 15న టీమ్‌ఇండియాతో జరగబోయే మ్యాచ్‌ను ఆడబోమని తొలుత బెట్టు చేసిన పాకిస్థాన్ ఆ తర్వాత దారికొచ్చింది. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలన్న తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు పాక్ సర్కార్ సోమవారం వెల్లడించింది. చర్చల ద్వారా వచ్చిన ఫలితంతో సంతృప్తి చెందడంతో పాటు మిత్ర దేశాలు విజ్ఞప్తి చేయడంతో భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు తమ జట్టుకు అనుమతిని ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) భారీ నష్టాన్ని చవిచూసే ముప్పు నుంచి తప్పించుకుంది.
ఐసీసీకి భారీ ఊరట!
కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో ఈనెల 15న భారత్, పాక్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో ఆడబోమని తొలుత ప్రకటించిన పాక్, ఆ తర్వాత ఆడతామని తెలిపింది. అయితే టోర్నీలోనే హై వోల్టెజ్ మ్యాచ్ ఇది. మిగిలిన మ్యాచ్‌ల కంటే దాయాదుల పోరుతోనే ఐసీసీ, ఆతిథ్య దేశం, బ్రాడ్‌కాస్టర్ తదితర విభాగాలకు భారీ ఆదాయం సమకూరుతుంది. అయితే పాక్ ఈ మ్యాచ్ ఆడబోమని ప్రకటించిన తర్వాత భారీ నష్టం తప్పదేమో అని అంతా భావించారు. కానీ పాక్ తాజా డెసిషన్‌తో ఐసీసీ భారీ నష్టం నుంచి తప్పించుకుంది. భారత్, పాక్ మ్యాచ్ జరగకపోతే అధికారిక ప్రసారదారు జియోస్టార్‌కు నష్టం వాటిల్లుతుంది. వ్యాపార ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయాన్ని జియోస్టార్ కోల్పోతుంది. అలాగే గేట్ మనీ (టికెట్ అమ్మకాలు), స్పాన్సర్‌షిప్స్ వంటి వాటిలో నష్టపోతుంది. దీంతో ఐసీసీని జియోస్టార్ రిబేట్ అడిగే అవకాశం ఉంది. అయితే భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు పాక్ ఓకే చెప్పడంతో ఐసీసీ 174 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం రూ. 1560 కోట్లు) నష్టం నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది.


