వివాదాస్పద స్థలాలకు ఇంటి అనుమతులు
కార్యదర్శి తెలవకుండా కారోబార్ సంతకాలు
పంచాయతీ స్టాంప్ వేసి అనుమతులు జారీ
ఏలుకుర్తి హవేలీ జీపీలో అక్రమాల వ్యవహారం
ఇద్దరు అన్నదమ్ముల మధ్య పంచాయితీతో వెలుగులోకి అసలు నిజం
తనకు తెలియకనే జరిగిందంటున్న పంచాయతీ కార్యదర్శి
తనకు సంబంధం లేదంటున్న కారోబార్
కాకతీయకు చిక్కిన ఆధారాలు..!
కాకతీయ, గీసుగొండ : వివాదంలో ఉన్న స్థలాలకు గ్రామ పంచాయతీ కార్యదర్శి, కారోబార్ కలిసి ఇంటి అనుమతి ధ్రువీకరణ పత్రాలు జారీ చేసిన ఘటన గీసుగొండ మండలంలో కలకలం రేపుతోంది. ఒకే స్థలానికి వేర్వేరు వ్యక్తులకు అనుమతులు ఇవ్వడం, అనంతరం రిజిస్ట్రేషన్లు జరగడం, చివరికి విషయం కోర్టు మెట్లు ఎక్కడంతో అసలు వ్యవహారం బయటపడింది. గీసుగొండ మండలం ఏలుకుర్తి హవేలీ గ్రామానికి చెందిన అన్నదమ్ముల మధ్య ఇంటి దారి విషయంలో చాలాకాలంగా వివాదం కొనసాగుతోంది. గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీలు నిర్వహించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి వివాదంలో ఉన్న స్థలానికి ఒక వ్యక్తికి ధ్రువీకరణ పత్రం జారీ చేయడంతో, అతడు దారితో సహా ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఈ విషయం తెలిసిన తమ్ముడు కూడా అదే గ్రామ పంచాయతీ కార్యదర్శి నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకుని, తన ఇంటి నంబరుతో ఉన్న స్థలానికి రిజిస్ట్రేషన్ చేయించుకోవడం మరింత వివాదానికి దారితీసింది. ఒకే స్థలానికి రెండు వేర్వేరు అనుమతులు ఎలా జారీ అయ్యాయన్న అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

కోర్టు మెట్లు ఎక్కిన వివాదం
ఇంటి ధ్రువీకరణ పత్రాల ఆధారంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న అన్నదమ్ములు పరస్పరం కోర్టును ఆశ్రయించి నోటీసులు పంపించుకున్నారు. దీంతో వివాదంలో ఉన్న స్థలానికి అనుమతులు ఎలా మంజూరయ్యాయన్న ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. తన అన్నకు వివాదాస్పద స్థలానికి ధ్రువీకరణ పత్రం ఎలా ఇచ్చారని తమ్ముడు గ్రామ పంచాయతీ కార్యదర్శికి నోటీసులు పంపినట్లు సమాచారం. ఈ వ్యవహారం గ్రామస్థాయిలోనే కాకుండా మండల వ్యాప్తంగా చర్చకు దారితీసింది. నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చారా, లేక ఉద్దేశపూర్వకంగా జరిగిందా అనే అంశాలపై విచారణ జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
తెలియక ఇచ్చానంటున్న కార్యదర్శి
ఈ వ్యవహారంపై ఎలుకుర్తి హవేలీ పంచాయతీ కార్యదర్శి కోడెపాక నరేష్ స్పందిస్తూ, ఇంటి ధ్రువీకరణ పత్రం కోసం గ్రామస్తుడు తన వద్దకు వచ్చాడని తెలిపారు. కారోబార్ శంకర్‌ను అడిగితే అన్ని వివరాలు సవ్యంగానే ఉన్నాయని చెప్పడంతోనే ధ్రువీకరణ పత్రం జారీ చేశానని వివరణ ఇచ్చారు. వివాదంలో ఉందని తనకు తెలియదని ఆయన పేర్కొన్నారు. ఇదే వివాదంలో మరో వ్యక్తికి తన సంతకాలను ఫోర్జరీ చేసి, దొంగ స్టాంపులతో తప్పుడు ధ్రువీకరణ పత్రం జారీ చేశారని ఆరోపించారు. ఈ విషయంపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు కార్యదర్శి తెలిపారు.
తనకు సంబంధం లేదంటున్న కారోబార్
వివాదంలో ఉన్న స్థలానికి జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఎలుకుర్తి హవేలీ కారోబార్ ఓ.శంకర్ స్పష్టం చేశారు. ఆ పత్రాలు పూర్తిగా గ్రామ పంచాయతీ కార్యదర్శి నరేష్ మంజూరు చేసినవేనని, ఈ వ్యవహారంలో తన జోక్యం ఏమీ లేదని ఆయన తెలిపారు. ఒకే స్థలానికి రెండు వేర్వేరు అనుమతులు జారీ కావడం, రిజిస్ట్రేషన్లు జరగడం వెనుక అసలు కారణాలపై ఉన్నతాధికారులు విచారణ జరిపించాలని స్థానికులు కోరుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


