కేఆర్ఆర్ సైన్స్ ఎక్స్‌పోలో తలుక్కుమన్న చారిత్రక నాణేలు
గుప్తులు, చోళులు, కాకతీయుల నాణేల ప్రదర్శన
204 దేశాల కరెన్సీ, స్టాంపులతో విశేష ఆకర్షణ
జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా గ్రాండ్ ఎక్స్‌పో
275 మంది విద్యార్థుల సృజనాత్మక ప్రాజెక్టులు
30 ఏళ్ల సేకరణతో ప్రిన్సిపాల్ ప్రత్యేక ప్రదర్శన
కాకతీయ,ఏలూరు ప్రతినిధి : కామవరపుకోట మండలంలోని తడికలపూడి కేఆర్ఆర్ బ్రైట్ మైండ్ స్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన 2026 సైన్స్ ఎక్స్‌పోలో గుప్తులు, చోళులు, కాకతీయుల కాలానికి చెందిన అరుదైన నాణేలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సైన్స్‌తో పాటు చరిత్రను కలిపిన ఈ ప్రదర్శన సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. శనివారం నిర్వహించిన ఈ ఎక్స్‌పోను ఏపీ హైకోర్టు అడ్వకేట్ తారక్ అభిలాష్ ప్రారంభించగా, తడికలపూడి ఎస్సై కె. చెన్నారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో 275 మంది విద్యార్థులు తమ ప్రతిభను చాటుతూ రూపొందించిన ప్రాజెక్టులను ప్రదర్శించారు. పర్యావరణ పరిరక్షణ, వ్యవసాయం, ఇరిగేషన్, మొబైల్ ఫోన్ల ప్రభావం, జంక్‌ఫుడ్ దుష్పలితాలు వంటి అంశాలపై పదుల సంఖ్యలో మోడళ్లు ఏర్పాటు చేశారు. 150కు పైగా టేబుళ్లపై అమర్చిన ప్రాజెక్టులు సందర్శకులను ఆకట్టుకున్నాయి.

204 దేశాల కరెన్సీ ప్రదర్శన
స్కూల్ ప్రిన్సిపాల్ ఏఎస్‌డబ్ల్యూ సత్యనారాయణ మూర్తి గత 30 ఏళ్లుగా సేకరించిన అరుదైన నాణేలు, కరెన్సీ నోట్లు, స్టాంపులు ఈ ఎక్స్‌పోలో ప్రత్యేకంగా ప్రదర్శించారు. మొత్తం 204 దేశాలకు చెందిన కరెన్సీ నోట్లు, నాణేలు సుమారు 100 కోట్ల డాలర్ల విలువైనవి ప్రదర్శనకు ఉంచడం విశేషం. వివిధ దేశాల రాచముద్రలు, చారిత్రక స్టాంపులు విద్యార్థుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. సీతారామ పట్టాభిషేకం కాలం, తానీషా కాలానికి చెందిన 450 ఏళ్ల నాటి పంచలోహ నాణేలు ప్రదర్శనలో ప్రత్యేక స్థానం సంపాదించాయి. అలాగే గుప్తులు, చోళులు, కాకతీయుల కాలం నాటి నాణేలు, రాచముద్రలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. రిజర్వ్ బ్యాంక్ స్థాపన అనంతరం ప్రతి ఏడాది విడుదలైన రూపాయి, రూ.2 నాణేలు, అణా, కాడె, బేడా వంటి పూర్వకాల కరెన్సీ నమూనాలు కూడా ప్రదర్శించారు. విద్యార్థులు చిన్న వయస్సులోనే శాస్త్రీయ ఆలోచనతో రూపొందించిన ప్రాజెక్టులను ఎస్సై చెన్నారావు అభినందించారు. సైన్స్ ఎగ్జిబిషన్లు విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీయడంలో కీలక పాత్ర పోషిస్తాయని ప్రిన్సిపాల్ సత్యనారాయణ మూర్తి పేర్కొన్నారు. స్కూల్ చైర్మన్ కొర్రపాటి సుధాకర్, తడికలపూడి శివాలయం చైర్మన్ మేకా వసంతరావు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు కార్యక్రమానికి హాజరై విద్యార్థుల ప్రతిభను అభినందించారు. సైన్స్ మరియు చరిత్ర సమ్మేళనంగా నిలిచిన ఈ ఎక్స్‌పో మండల స్థాయిలో విశేష స్పందన పొందింది.


