ప్రకృతి వ్యవసాయంపై రైతులకు మార్గదర్శనం
పాలేరు గ్రామంలో అవగాహన శిబిరం
కాకతీయ, కూసుమంచి: కూసుమంచి మండలం పాలేరు గ్రామంలో రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు సతీష్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం వల్ల భూసారం పెరిగి నేల ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. రసాయనాల వినియోగాన్ని తగ్గించడం ద్వారా పంటల వ్యయం కూడా తగ్గుతుందని పేర్కొన్నారు. కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ చైతన్య మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం ద్వారా నాణ్యమైన ఆహారం ఉత్పత్తి సాధ్యమవుతుందని చెప్పారు. జీవన ఎరువులు, వర్మీ కంపోస్ట్, గోమూత్రం, పుల్లటి మజ్జిగ, బ్రహ్మాస్త్రం, ద్రవ జీవామృతం, నీమాస్త్రం, దశపర్ణిక వంటి ద్రావణాల తయారీ విధానాలను వివరించారు.అనంతరం రైతులకు భూసార పరీక్ష విశ్లేషణ పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రామడుగు వాణి, వ్యవసాయ విస్తరణ అధికారులు ప్రియాంక, సాయిరాం తదితరులు పాల్గొన్నారు.


