కాకతీయ, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా లేదా బదిలీ వర్కర్లుగా పనిచేస్తున్న మహిళలకు సింగరేణి యాజమాన్యం ఓపెన్ కాస్ట్ గనుల్లో భారీ యంత్రాలపై ఆపరేటర్లుగా పని చేయడానికి ఎంపిక కోసం దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. మైనింగ్ రంగంలో మహిళల సాధికారత, సమాన అవకాశాలు, మానవ వనరుల సమర్థ వినియోగంలో భాగంగా సీఎండీ ఎన్.బలరామ్ ఆలోచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ మేరకు శనివారం సింగరేణి యాజమాన్యం అన్ని గనులకు, డిపార్ట్మెంట్లకు సర్క్యులర్ విడుదల చేసింది. ఓపెన్ కాస్ట్ గనుల్లో మహిళలకు భారీ యంత్రాలపై ఆపరేటర్లుగా పనిచేసే అవకాశం ఇవ్వడం సింగరేణి చరిత్రలో ఇదే తొలిసారి. ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్ లేదా బదిలీ వర్కర్ గా పనిచేస్తున్న 35 సంవత్సరాల లోపు వయసు ఉండి కనీసం ఏడవ తరగతి పాసైన మహిళా అభ్యర్థులు ఈ ఆపరేటర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు అని యాజమాన్యం పేర్కొంది.
ఇవీ అర్హతలు..
దరఖాస్తు చేసుకునే మహిళలు శారీరక సామర్థ్యం కలిగి ఉండాలని కనీసం ద్విచక్ర లేదా నాలుగు చక్రాల వాహన డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండాలని, ఆగస్టు 2024 కన్నా ముందు డ్రైవింగ్ లైసెన్స్ పొంది ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుందని కూడా యాజమాన్యం పేర్కొంది. పై అర్హతలు గల మహిళా ఉద్యోగులు ఇవ్వబడిన నమూనాలో అప్లికేషన్లు పూర్తి చేసి సంబంధిత గని మేనేజర్ లేదా శాఖాధిపతికి లేదా జనరల్ మేనేజర్ కు అందజేయాలని సూచించారు.
దరఖాస్తుల స్వీకరణ తర్వాత జనరల్ మేనేజర్ సిపిపి నేతృత్వంలోని ఒక కమిటీ దరఖాస్తులను పరిశీలించి కనీస అర్హతలు గల అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కమిటీ ఎంపిక చేసిన అభ్యర్థులు సిరిసిల్లలోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ సంస్థ హెవీ గూడ్స్ వెహికల్, హెవీ మోటార్ వెహికల్ విభాగంలో శిక్షణ పొందాల్సి ఉంటుంది.
శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం ఖాళీల లభ్యతను బట్టి నిర్వహించే ఎంపిక పరీక్షలో ఉత్తీర్ణులు అయిన వారిని ఈపీ ఆపరేటర్ ట్రైనీ కేటగిరి-5 డిసిగ్నేషన్ తో సంబంధిత ఏరియాలకు పంపించడం జరుగుతుంది. ఆసక్తి గల మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలసిందిగా యాజమాన్యం కోరుతోంది.


