మేడ్చల్ డీసీసీపై కసరత్తు షురూ
రంగంలోకి టీపీసీసీ పరిశీలకులు
జనవరి 1 వరకు క్షేత్రస్థాయిలో అభిప్రాయ సేకరణ
సామాజిక సమీకరణలు, క్లీన్ ఇమేజ్‌కే పెద్దపీట
జిల్లా పరిశీలకులుగా రాష్ట్ర అధికార ప్రతినిధి గాజర్ల అశోక్ (ఐతు)
కాకతీయ, మేడ్చల్ : మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) నూతన కార్యవర్గ కూర్పుపై పార్టీ అధిష్టానం కసరత్తు ప్రారంభించింది. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో అన్ని సామాజిక వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించేలా కమిటీని రూపొందించేందుకు తెలంగాణ పీసీసీ చర్యలు చేపట్టింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశాల మేరకు జిల్లా పరిశీలకులుగా రాష్ట్ర అధికార ప్రతినిధి గాజర్ల అశోక్ (ఐతు), రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గం భాస్కర్‌ను నియమించారు.
పరిశీలకుల జిల్లా పర్యటన
బుధవారం జిల్లాకు చేరుకున్న పరిశీలకుల బృందం గురువారం నుంచి జనవరి 1వ తేదీ వరకు ఉప్పల్, మేడ్చల్, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, కూకట్‌పల్లి నియోజకవర్గాల్లో పర్యటించనుంది. డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్‌తో పాటు ఆయా నియోజకవర్గాల ఇంచార్జ్‌లు, ముఖ్య నేతలతో సమావేశమై క్షేత్రస్థాయిలో అభిప్రాయాలను సేకరించనున్నారు. నూతన కార్యవర్గ ఎంపికలో టీపీసీసీ పలు కీలక మార్గదర్శకాలను నిర్దేశించింది. రాజకీయ ఉద్యమాల్లో నమోదైన కేసులు మినహా, హత్య, గృహహింస, డ్రగ్స్, ఆర్థిక నేరాలు వంటి తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నవారికి కార్యవర్గంలో చోటు ఉండదని స్పష్టం చేసింది. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు మహిళలకు 20 నుంచి 25 శాతం వరకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది.
జనవరిలో తుది జాబితా
పరిశీలకులు ఇప్పటికే జిల్లా రాజకీయ పరిస్థితులపై పీసీసీ అధ్యక్షుడితో ప్రాథమికంగా చర్చలు జరిపినట్లు సమాచారం. వారం రోజుల పాటు జరిగే అభిప్రాయ సేకరణ అనంతరం నివేదికను టీపీసీకి సమర్పించనున్నారు. పీసీసీ చీఫ్ ఆమోదంతో జనవరి నెలలో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.


