ప్రతి పౌరుడికి సమాన హక్కు
పౌర హక్కులపై అవగాహన తప్పనిసరి
తహసీల్దార్ ముల్కనూరి శ్రీనివాస్
కాకతీయ, రాయపర్తి : సమాజంలో ప్రతి పౌరుడికి సమాన హక్కులు ఉంటాయని, భారత రాజ్యాంగం ప్రకారం పౌర హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండాలని తహసీల్దార్ ముల్కనూరి శ్రీనివాస్ అన్నారు. శనివారం మండలంలోని మహబూబ్‌నగర్ గ్రామంలో నిర్వహించిన పౌరహక్కుల దినోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాజ్యాంగం పౌరులందరికీ సమాన హక్కులు కల్పించిందని సూచించారు. అంటరానితనం వంటి సామాజిక జాడ్యాలను రూపుమాపడమే పౌరహక్కుల దినోత్సవం ముఖ్య ఉద్దేశమని అన్నారు. కుల వివక్ష చూపడం చట్టరీత్యా నేరమన్నారు. అంటరానితనం పాటించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ పరస్పర గౌరవంతో, సోదరభావంతో మెలగాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ పెండ్లి మహేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ చిన్నబోయిన రవి, వార్డు సభ్యులు, ఆర్ఐ చంద్రమోహన్, వ్యవసాయ అధికారి గుమ్మడి వీరభద్రం, గ్రామస్తులు పాల్గొన్నారు.


