కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో జరుగబోయే గ్రామపంచాయతీ ఎన్నికలపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సర్పంచ్ అభ్యర్థులు డబ్బులు ఖర్చు పెట్టొద్దని, తొందరపడి దసరాకు విందులు ఏర్పాటు చేయవద్దని సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ ఎన్నికలు లీగల్‌గా చెల్లుబాటయ్యే పరిస్థితి లేకపోవచ్చని ఆయన హెచ్చరించారు.
ఈటెల మాట్లాడుతూ.. ఇది రాజ్యాంగబద్ధంగా లేని విధంగా జరుగుతున్న ఎన్నికలు. కోర్టు కొట్టేస్తే పరిస్థితి ఏమవుతుంది?” అని ప్రశ్నించారు. మహారాష్ట్రలో ఇలాంటి పరిస్థితే ఎదురైందని గుర్తుచేశారు. అక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యాక హైకోర్టు వాటిని రద్దు చేసింది. దీంతో అభ్యర్థులు చేసిన ఖర్చు మొత్తం వృథా అయ్యిందని ఆయన ఉదహరించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పేరుతో ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని ఈటెల ఆరోపించారు. నిజానికి ఇది పూర్తిగా డ్రామా మాత్రమేనని, చట్టపరమైన సమస్యల కారణంగా ఈ ఎన్నికలు నిలిచిపోవచ్చని అన్నారు. అందుకే అభ్యర్థులు జాగ్రత్తగా వ్యవహరించాలని, డబ్బు ఖర్చు పెట్టకుండా వేచి చూడాలని సూచించారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియలో ప్రజలకు భరోసా కలిగించడం లేదు అని ఈటెల అన్నారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ ఎన్నికలు కోర్టులో నిలవవని ఆయన ధీమాగా చెప్పారు. మహారాష్ట్రలో ఎన్నికలు రద్దు అయినట్లే, ఇక్కడ కూడా అదే పరిస్థితి రావచ్చని ఆయన హెచ్చరించారు. ఇప్పుడు డబ్బు వెచ్చిస్తే అది మళ్లీ తిరిగి రావడం చాలా కష్టం. చట్టపరంగా ఈ ఎన్నికలు కొనసాగకపోవచ్చు. కాబట్టి అందరూ ఓపికగా ఉండండి అని ఈటెల స్పష్టం చేశారు. అభ్యర్థులు నిరాశ చెందకుండా, పరిస్థితి క్లారిటీ వచ్చే వరకు ఎటువంటి పెద్ద ఖర్చులు చేయవద్దని సూచించారు.


