దాతల భూములపై డేగకన్ను..!
బడా బాబుల కోసమే భూముల అమ్మకాలా?
రెవెన్యూ లోటు పూడ్చేందుకే పేదలపై ఉక్కుపాదమా?
బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు
పేదల ఇళ్ల కూల్చివేతలపై బీజేపీ ఆగ్రహం
ఖమ్మం, కాకతీయ: ఖమ్మం జిల్లాలో దశాబ్దాలుగా నివసిస్తున్న పేదల ఇళ్లను కూల్చివేయడం అమానుషమని, దాతలు పేదల కోసం ఇచ్చిన భూములను కాజేయాలని ప్రభుత్వం చూస్తోందని బీజేపీ తీవ్రంగా ధ్వజమెత్తింది. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు, జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. 1954లో భూదాన స్ఫూర్తితో కల్వల రాజేశ్వరరావు సుమారు 62 ఎకరాల భూమిని పేదల నివాసాల కోసం దానం చేశారని గుర్తుచేశారు. ఆ భూముల్లో గుడిసెలు వేసుకుని జీవిస్తున్న కుటుంబాలను రాత్రికి రాత్రే బుల్డోజర్లతో తరిమేయడం రాక్షసత్వమని విమర్శించారు. ఆధార్ కార్డులు సేకరించి, పంచనామాలు చేసి, 24 గంటల గడువు కూడా ఇవ్వకుండా ఇళ్లు కూల్చడం మానవత్వానికి విరుద్ధమన్నారు. ప్రభుత్వం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉందని, సుమారు తొంభై వేల కోట్ల రూపాయల రెవెన్యూ లోటును పూడ్చుకునేందుకే భూముల అమ్మకాల పన్నాగమని ఆరోపించారు. పక్కా ఇళ్లు కట్టుకున్న కబ్జాదారులను వదిలేసి పేదల పూరిగుడిసెలపై ప్రతాపం చూపడం అన్యాయమన్నారు. తక్షణమే కూల్చివేతలు ఆపి, నిరాశ్రయులైన వారికి అదే స్థలంలో ఇళ్లు కట్టించాలని డిమాండ్ చేశారు. లేదంటే జిల్లా వ్యాప్తంగా ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.


