ఉద్యోగం ఉన్నట్టా..?లేనట్టా..?
పనిచేస్తున్నట్టా..? చేయడం లేదన్నట్టా..?!
త్రిశంకు స్వర్గంలో భూ భారతి సర్వేయర్లు
వర్క ఆర్డర్ లేక..జీతాలు రాక అయోమయంలో సర్వేయర్లు
తొమ్మిది నెలలుగా వేతనాలు లేక అవస్థలు
పేరుకు పెద్దగా ప్రకటించి.. తుస్సుమనిపించిన ప్రభుత్వం
భూ భారతిలో కనిపించని సర్వే ప్రగతి
కార్యరూపం దాల్చని ప్రభుత్వ హామీలు
శిక్షణ, పరీక్షలు పూర్తి… కానీ పారితోషికంపై స్పష్టత లేదు
ఉన్నతాధికారుల వద్ద సర్వేయర్ల ఆవేదన
ఉండాలా..వదులుకోవాలో తెలియక కొట్టుమిట్టాడుతున్న ఉద్యోగులు
కాకతీయ, తెలంగాణ బ్యూరో/చింతకాని : ఉద్యోగం వచ్చిన ఆనందం కళ్లలో మెరుపులా మెరిసి మసకబారింది. లైసెన్స్ సర్వేయర్‌గా నియామకం జరిగిందని కుటుంబాలకు చెప్పుకున్న వారు, ఇప్పుడు జీతం లేక, స్పష్టత లేక త్రిశంకు స్వర్గంలో వేలాడుతున్నారు. పనిలో ఉన్నట్టే కనిపిస్తున్నా, వేతనం మాత్రం కనిపించని స్థితి నెలకొంది. భూ భారతి అమలుకు కీలకంగా తీసుకొచ్చిన ఈ వ్యవస్థ, అమలు లోపాలతో సర్వేయర్ల భవిష్యత్తునే ప్రశ్నార్థకంగా మార్చిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో భూముల క్రయవిక్రయాల్లో పారదర్శకత కోసం ప్రతి రిజిస్ట్రేషన్‌కు సర్వే పటం తప్పనిసరి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ధరణి స్థానంలో తీసుకొచ్చిన భూ భారతి చట్టం అమలులో భాగంగా లైసెన్స్ సర్వేయర్ల నియామకం చేపట్టింది. 2025 మేలో జారీ చేసిన నోటిఫికేషన్‌కు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10 వేల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. శిక్షణ ఫీజు పేరుతో సాధారణులకు 10 వేల రూపాయలు, బీసీలకు 5 వేల రూపాయలు, ఎస్సీ, ఎస్టీలకు 2,500 రూపాయలు వసూలు చేశారు.
భారీ శిక్షణ… భారీ హామీలు
మే 26 నుంచి 40 రోజులపాటు జిల్లా కేంద్రాల్లో శిక్షణ ఇచ్చారు. జూలై 26న తుది పరీక్ష నిర్వహించారు. ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 25 వరకు మండల తహసీల్దార్ కార్యాలయాల్లో అప్రెంటిస్ శిక్షణ ఇచ్చారు. అసెస్‌మెంట్ పరీక్షలో 3,500 మంది ఉత్తీర్ణులయ్యారు. అనంతరం రెండో విడతలో మరో 2,500 మందికి లైసెన్సులు జారీ చేశారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా లైసెన్సులు అందుకున్న సర్వేయర్లు, జనవరి 7, 2026లోపు మండల కేంద్రాల్లో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు అందుకున్నారు. అయితే విధుల్లో చేరిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందని సర్వేయర్లు చెబుతున్నారు. నియామకం ఉన్నట్టే కానీ వేతనం లేదు. బాధ్యతలు ఉన్నట్టే కానీ స్పష్టమైన వర్క్ ఆర్డర్ లేదు. భూ భారతి కోసం ప్రత్యేక యాప్ తీసుకొస్తామని, పండుగల నాటికి పూర్తి స్థాయి అమలు చేస్తామని పలుమార్లు ప్రకటించినా ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదని వాపోతున్నారు.
వేతనం లేక అవస్థలు..
తొమ్మిది నెలలుగా వేతనాలు లేకుండా పనిచేయాల్సిన పరిస్థితి నెలకొన్నదని సర్వేయర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూ భారతి అమలులో భాగంగా ప్రతి రిజిస్ట్రేషన్‌కు సర్వే మ్యాప్ జత చేయడమే ప్రధాన లక్ష్యమని ప్రకటించినా, ఇప్పటివరకు ఆ వ్యవస్థ పూర్తిస్థాయిలో అమలు కాలేదని చెబుతున్నారు. బదులుగా గ్రామాల రీ సర్వే పనులు అప్పగిస్తున్నారని పేర్కొంటున్నారు. 2 వేల ఎకరాల లోపు గ్రామాలకు 40 వేల రూపాయలు, అంతకంటే ఎక్కువైతే 60 వేల రూపాయలు ఇస్తామని చెబుతున్నారని సమాచారం. అయితే ఒక గ్రామాన్ని పూర్తిగా రీ సర్వే చేయాలంటే కనీసం ఆరు నెలలు పడుతుందని, ప్రభుత్వం నిర్ణయించిన పారితోషికం తగినంత కాదని సర్వేయర్లు అంటున్నారు. టీ ఖర్చులకు కూడా సరిపోని స్థితిలో కుటుంబాలను ఎలా పోషించాలన్నదే పెద్ద ప్రశ్నగా మారిందని వాపోతున్నారు.
కనిపించని ప్రగతి..ఏమవుతుందో సర్వయర్ల గతి…!
రెవెన్యూ కొలతలు, సరిహద్దుల చట్టం 1923 ప్రకారం నిజాం కాలంలో రూపొందించిన రికార్డుల ఆధారంగానే ఇప్పటికీ సర్వే శాఖ పనిచేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు, దేవాదాయ, అసైన్డ్, అటవీ భూముల వివరాలు సర్వే శాఖ వద్ద ఉన్నప్పటికీ, పూర్తి స్థాయి రీ సర్వే ప్రణాళికపై స్పష్టత లేదని చెబుతున్నారు. భూ భారతి అమలు పేరుతో పెద్ద ప్రకటనలు చేసినా, భూముల సర్వేలో గణనీయమైన ప్రగతి కనిపించడం లేదని సర్వేయర్లు అంటున్నారు. జిల్లా స్థాయిలో సర్వే, భూ రికార్డుల అధికారులు, కలెక్టర్, రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారులను పలుమార్లు కలిసినా సమస్యకు పరిష్కారం దొరకలేదని సర్వేయర్లు చెబుతున్నారు. వేతనాలపై స్పష్టమైన ఉత్తర్వులు లేకపోవడం వల్ల బ్యాంకు రుణాలు, కుటుంబ ఖర్చులు, వసతి సమస్యలు వెంటాడుతున్నాయని వాపోతున్నారు. ఉద్యోగం ఉన్నట్టే కనిపిస్తున్నా, జీవన భద్రత లేకపోవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని పేర్కొంటున్నారు.
ఉండాలా..? వదులుకోవాలా..?
ఉద్యోగ భద్రత, వేతనాలపై తక్షణ స్పష్టత ఇవ్వాలని, వర్క్ ఆర్డర్లు జారీ చేసి వ్యవస్థను సక్రమంగా అమలు చేయాలని లైసెన్స్ సర్వేయర్లు డిమాండ్ చేస్తున్నారు. భూ భారతి అమలులో తమ సేవలు కీలకమని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ఆ సేవలకు గౌరవం, పారితోషికం లేకపోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “మా జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయి. ప్రభుత్వం వెంటనే స్పందించాలి” అంటూ సర్వేయర్లు వేడుకుంటున్నారు.


