డిజిటల్ అరెస్ట్ స్కామ్.. నిర్మలా సీతారామన్ పేరుతో రూ. 99 లక్షలు దోపిడి!
దేశంలో కొత్తగా భయపెడుతున్న డిజిటల్ అరెస్ట్
పుణెలో రిటైర్డ్ మహిళను లక్ష్యంగా చేసుకున్న సైబర్ గ్యాంగ్
నిర్మలా సీతారామన్ నకిలీ సంతకంతో ఘరానా మోసం
కాకతీయ, జాతీయం : సైబర్ నేరగాళ్లు కొత్త రూపంలో ప్రజలను మోసం చేస్తున్నారు. “డిజిటల్ అరెస్ట్” పేరుతో వ్యక్తులను కేసుల్లో ఇరుక్కున్నారని భయపెట్టి, ఒత్తిడికి గురిచేసి భారీ మొత్తంలో డబ్బు దోచుకుంటున్నారు. ఈ స్కామ్‌లో ప్రధానంగా సైబర్ క్రిమినల్స్, ప్రభుత్వ అధికారులు లేదా ఏజెన్సీల పేరుతో నకిలీ పత్రాలు తయారు చేసి బాధితులను మోసం చేస్తున్నారు. ఇటీవల ముంబయిలో జరిగిన రూ. 58 కోట్ల డిజిటల్ అరెస్ట్ స్కామ్ దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఇటువంటి ఘటన మరొకటి వెలుగు చూసింది. నిర్మలా సీతారామన్ పేరు చెప్పి రూ. 99 లక్షలు దోపిడి చేసేశారు సైబర్ నేరగాళ్లు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
పుణెలో నివసించే 62 ఏళ్ల మాజీ ఎల్‌ఐసీ అధికారిణికి ఒక వ్యక్తి ఫోన్ చేసి తాను డేటా ప్రొటెక్షన్ ఏజెన్సీ ప్రతినిధినని నమ్మబలికాడు. ఆ వ్యక్తి, ఆమె ఆధార్ నంబర్‌కు అనుబంధంగా ఉన్న మొబైల్ నంబర్ ను మోసపూరిత లావాదేవీల్లో ఉపయోగించబడిందని, ఈ కేసు సంబంధంగా ఆమెపై విచారణ జరుగుతోందని భయపెట్టాడు. మీరు కోర్టు కేసుల్లో ఇరుక్కుంటారు, మీరు సహకరించకపోతే ఆన్‌లైన్‌లో అరెస్ట్ వారెంట్ జారీ చేస్తామంటూ హెచ్చరించిన నేరగాడు ఆమెను పూర్తిగా గందరగోళానికి గురిచేశాడు.
భయాందోళనలో ఉన్న ఆ మహిళ, నేరగాళ్లు సూచించిన బ్యాంక్ ఖాతాలకు మొత్తం రూ.99 లక్షలు బదిలీ చేశారు. తరువాత ఆ వ్యక్తిని సంప్రదించే ప్రయత్నం చేసినా, ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో తాను మోసపోయానని గుర్తించారు. వెంటనే పుణె సిటీ సైబర్ పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు, పూర్తి వివరాలు తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసి, డబ్బు బదిలీ అయిన ఖాతాలను గుర్తించి వాటిని బ్లాక్ చేయడానికి చర్యలు చేపట్టారు.
ఈ కేసులో ఆశ్చర్యకర విషయం ఏమిటంటే, నేరగాళ్లు బాధితురాలిని నమ్మించే క్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంతకం ఉన్న నకిలీ పత్రంను ఉపయోగించారు. దీనితో బాధితురాలు అది నిజమైన అధికార పత్రం అని నమ్మి, డబ్బు బదిలీ చేయడం జరిగింది. ఈ విధంగా, మోసగాళ్లు ఇప్పుడు కేంద్ర మంత్రుల పేర్లను కూడా వాడుతూ ప్రజల విశ్వాసాన్ని దోచుకుంటున్నారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కాగా, ఇటీవల ముంబైలో నిందితులు ఈడీ అధికారులుగా నటించి, నగరానికి చెందిన వ్యాపారవేత్త వద్ద నుంచి రూ. 58 కోట్లు దోచుకున్నారు. దేశంలో ఇప్పటివరకు నమోదైన అతిపెద్ద సైబర్ మోసాలలో ఇదొకటి. ఈ మోసంలో హాంకాంగ్, చైనా, ఇండోనేసియా వంటి దేశాలకు చెందిన నెట్‌వర్క్ ప్రమేయం ఉన్నట్లు మహారాష్ట్ర సైబర్ విభాగం అనుమానం వ్యక్తం చేస్తోంది.


