గ్రామీణుల ఆదాయం పెరిగితేనే అభివృద్ధి
పంచాయతీలు స్వయం సంపన్నంగా మారాలి
అభివృద్ధికి ముందస్తు ప్రణాళికలు అవసరం
గంగారంలో ఇంటిగ్రేటెడ్ పంచాయతీ ఆఫీస్ శంకుస్థాపన
సత్తుపల్లికి మరింత కీర్తి తెస్తాం : మంత్రి తుమ్మల
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : గ్రామపంచాయతీలు ఆదాయ మార్గాలు పెంచుకొని అభివృద్ధికి స్పష్టమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత–జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆదివారం సత్తుపల్లి మండలం గంగారంలో ఇంటిగ్రేటెడ్ పంచాయతీ ఆఫీస్‌కు సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్‌తో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ… 1964 ప్రాంతంలోనే సత్తుపల్లి మండలంలోని కిష్టారం, గంగారంలో హైస్కూల్ నిర్మాణాలు జరిగాయని గుర్తు చేశారు. సత్తుపల్లి నియోజకవర్గానికి మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు తెచ్చిన మంచి పేరును కాపాడుకోవడమే కాకుండా, అంతకంటే ఎక్కువ కీర్తి తీసుకొచ్చేలా తనవంతు కృషి చేశానని తెలిపారు. శ్రీరామచంద్ర స్వామి దయతో గోదావరి జలాలు బేతుపల్లి చెరువుకు చేరుతున్నాయన్నారు.
మౌలిక వసతులతో అభివృద్ధి
జనవరి తర్వాత గ్రీన్ ఫీల్డ్ హైవే ద్వారా కేవలం 34 నిమిషాల్లో ఖమ్మం చేరుకునే పరిస్థితి ఏర్పడుతుందని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న సత్తుపల్లి అన్ని మండలాలకు అనువైన కేంద్ర బిందువుగా ఉండేలా కల్లూరు డివిజన్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. గ్రామాల్లో మౌలిక వసతులు బలోపేతం చేస్తేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు.గ్రామపంచాయతీలు తమ ఆదాయాలను పెంచుకొని గ్రామాభివృద్ధికి ఉపయోగించుకోవాలని మంత్రి సూచించారు. సత్తుపల్లి ప్రాంతానికి పూర్వం నుంచే మంచి పేరు ఉందని, ఆ ప్రతిష్ఠను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. రాజకీయాల్లో నిబద్ధతతో పని చేస్తేనే దీర్ఘకాలం నిలబడగలమని, క్యారెక్టర్ దెబ్బతింటే ఎంత డబ్బు ఉన్నా ప్రజలు ఆదరించరని మంత్రి వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, ఏసీపీ వసుంధర యాదవ్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


