పేదల ఇండ్లు కూల్చడం అమానుషం
కాంగ్రెస్ పాలనలో కక్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపణలు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ భవన్లో నిర్వహించిన ప్రెస్మీట్లో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద వర్గాలపై పగబట్టిన విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో సుమారు 600 మంది నిరుపేదల ఇండ్లను కూల్చివేశారని, పేదల ఇళ్లు కూల్చడమే ప్రభుత్వ లక్ష్యంగా మారిందని విమర్శించారు. పట్టాలు ఉన్నాయని చెప్పినప్పటికీ ఇండ్లను కూల్చడం అమానుష చర్య అని అన్నారు. హైదరాబాద్లో హైడ్రా పేరుతో అనేక మంది పేదల ఇండ్లు కూల్చారని, ఖమ్మంలో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపార ప్రయోజనాల కోసమే ఈ చర్యలు తీసుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో ఇలాంటి సంఘటనలు అనేకం జరిగాయని, లగచర్లలో గిరిజన భూములను బలవంతంగా స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. గాంధీ సరోవర్ పేరుతో 50 వేల ఇండ్లను కూల్చేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్లను కూల్చే విధానాన్నే అనుసరిస్తోందని తీవ్రంగా ఖండించారు. ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు ఈ ఘటనలపై స్పందించకపోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. భూదాన్ భూములను ఎవరికి కట్టబెట్టేందుకు ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తుందో చెప్పాలని ప్రశ్నించారు. కుమ్మెర జాతరలో జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ, విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీస్ వ్యవస్థలో దుర్మార్గమైన పరిస్థితులు నెలకొన్నాయని, కాంగ్రెస్ నాయకులు చెప్పినప్పుడే కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో పేదలకు న్యాయం దక్కడం లేదని అన్నారు. ఈ ప్రెస్మీట్లో తుల ఉమ, సుమిత్రానంద్, లోక బాపు రెడ్డి, మంజులా రాణి తదితరులు పాల్గొన్నారు.


