మోదీ పాలనలో దేశానికి ప్రమాదం
కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు
సీపీఐ (ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు
ఖమ్మంలో యర్రా శ్రీకాంత్ విగ్రహావిష్కరణ సభలో ఘాటు వ్యాఖ్యలు
కాకతీయ, ఖమ్మం : మోదీ పాలనలో దేశ ప్రజాస్వామ్యం, లౌకికవాదం ప్రమాదంలో పడ్డాయని సీపీఐ (ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు తీవ్రంగా విమర్శించారు. కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఆరోపించారు. ఖమ్మం బోసు బొమ్మ సెంటర్‌లో యర్రా శ్రీకాంత్ విగ్రహావిష్కరణ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టి అమెరికా నుంచి దిగుమతి సుంకం లేకుండా పంట ఉత్పత్తులు తీసుకొస్తున్నారని, దీని వల్ల దేశీయ వ్యవసాయం, పౌల్ట్రీ, డెయిరీ రంగాలు దెబ్బతింటాయని హెచ్చరించారు. విద్యుత్ ప్రైవేటీకరణలో భాగంగా స్మార్ట్ మీటర్లు అమలు చేస్తూ భవిష్యత్తులో రీచార్జ్ లేకపోతే కరెంటు నిలిపివేస్తారన్నారు.
ప్రజా జీవనంలో కమ్యూనిస్టుల పాత్ర
ప్రజల నమ్మకం పొందాలంటే కమ్యూనిస్టులు ప్రజా జీవనంలోని అన్ని పార్శ్వాలను స్పృశించాలని రాఘవులు సూచించారు. అలాంటి నేతల్లో యర్రా శ్రీకాంత్ ఒకరని, ఆయన స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలను నిర్మించాలన్నారు. ఉపాధి హామీ చట్టం రద్దుకు వ్యతిరేకంగా మార్చి 24న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. కేంద్ర విధానాలపై దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఇక రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ సీపీఐ (ఎం) పోరాట ఫలితంగానే ఖమ్మంలో వేలాది పేదలకు ఇండ్ల పట్టాలు వచ్చాయని పేర్కొన్నారు. కార్యక్రమానికి ముందు గాంధీచౌక్ నుంచి బోసు బొమ్మ సెంటర్ వరకు ‘యర్రా’ కవాత్ నిర్వహించారు. రెడ్ షర్ట్స్, శారీస్ ధరించిన కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.


