‘‘అసెంబ్లీలోనే కాంగ్రెస్‌కు గట్టి కౌంటర్’’
నేటి నుంచి అసెంబ్లీకి కేసీఆర్ హాజరు
నీటి హక్కులపై సభ వేదికగా పోరాటం
పాలమూరు–రంగారెడ్డి అంశమే ప్రధాన ఎజెండా
సమావేశాల తర్వాత భారీ బహిరంగ సభకు నిర్ణయం
కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ ప్రజాక్షేత్రంలోకి రావడానికి సిద్ధమయ్యారు. ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో జరిగిన పార్టీ సీనియర్ నేతల సమావేశంలో ఆయన భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేసినట్లు సమాచారం. ఈ నెల 29 నుంచి ప్రారంభంకానున్న అసెంబ్లీ సమావేశాలకు తప్పకుండా హాజరవుతానని పార్టీ నేతలకు స్పష్టం చేసినట్లు తెలిసింది. నీటి హక్కుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిని, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని సభ వేదికగా ఎండగట్టడమే లక్ష్యంగా కేసీఆర్ వ్యూహం రచించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
నీటి హక్కులే ప్రధాన ఆయుధం
తెలంగాణకు రావాల్సిన నదీ జలాల వాటాలో కేంద్రం వివక్ష చూపుతోందని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ అంశాన్ని అసెంబ్లీ వేదికగా బలంగా లేవనెత్తాలని నిర్ణయించారు. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకురావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. ఈ నిర్ణయం వల్ల తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటాయని ప్రజలకు వివరించాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.
పాలమూరు–రంగారెడ్డి చుట్టే పోరాటం
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో జరుగుతున్న జాప్యం, కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులపై ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడంలో విఫలమైందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ అంశంపై అటు అసెంబ్లీలో, ఇటు క్షేత్రస్థాయిలో బలమైన పోరాటం చేయాలని కేసీఆర్ స్పష్టం చేసినట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాలు కనీసం 15 రోజులు నిర్వహించాలని అధికారపక్షాన్ని డిమాండ్ చేయాలని పార్టీ నేతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
సమావేశాల తర్వాత భారీ సభలు
అసెంబ్లీ సమావేశాల అనంతరం మహబూబ్‌నగర్ సమీపంలోని మండల కేంద్రంలో పాలమూరు–రంగారెడ్డి అంశంపై భారీ బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. అలాగే రాష్ట్రవ్యాప్తంగా సభలు, సమావేశాలు నిర్వహించి ప్రజలను చైతన్యపరచాలని పార్టీ శ్రేణులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ చరిత్రపూర్వకాలం నుంచీ తెలంగాణకు ద్రోహం చేస్తూనే వచ్చిందని, ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోందని కేసీఆర్ విమర్శించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.


