టాటా ట్రస్ట్స్‌లో విభేదాల మళ్లీ వెలుగులోకి..!
రతన్ టాటా తర్వాత వారసత్వ పోరు
నోయెల్ టాటా కుమారుడు నెవిల్లే నియామకంపై ట్రస్టుల్లో విభేదాలు
కాకతీయ, బిజినెస్: టాటా గ్రూప్ ప్రపంచంలోని అతిపెద్ద బిజినెస్ సమూహాలలో ఒకటి. 156 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ సామ్రాజ్యంలో 400 కంపెనీలు ఉన్నాయి. టాటా సన్స్ అనే హోల్డింగ్ కంపెనీ మొత్తం గ్రూప్‌పై నియంత్రణ కలిగి ఉండగా, దాని మెజారిటీ వాటా రెండు శక్తివంతమైన దాతృత్వ ట్రస్టులైన సర్ దోరాబ్జీ టాటా ట్రస్ట్ (SDTT) మరియు సర్ రతన్ టాటా ట్రస్ట్ (SRTT) వద్ద ఉంది. 2024 అక్టోబర్లో టాటా గ్రూప్ పితామహుడు రతన్ టాటా మరణించిన తర్వాత, ఆయన స్థానంలో నోయెల్ టాటా టాటా ట్రస్ట్స్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు.
అయితే రతన్ టాటా అనంతరం వారసత్వ సమతుల్యం సున్నితంగా మారిందనే విషయం ఇప్పుడు స్పష్టమవుతోంది. టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్, కొందరు ట్రస్టీల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నట్లు కనిపిస్తోంది. నోయెల్ టాటా కుమారుడు నెవిల్లే టాటా (33), ఇటీవల శ్రీ దోరాబ్జీ టాటా ట్రస్ట్ (SDTT) బోర్డులో ట్రస్టీగా నియమితులయ్యారు. మాజీ గ్రూప్ కంపెనీ నాయకుడు భాస్కర్ భట్ కూడా అదే ట్రస్ట్‌లో సభ్యుడిగా చేరారు. ఈ నియామకాన్ని ట్రస్ట్ బుధవారం అధికారికంగా ప్రకటించింది. గత నెలలో మెహ్లి మిస్త్రీ రిటైర్ అవడంతో ఈ పోస్టు ఖాళీగా ఉండగా, నెవిల్లే నియామకంతో టాటా కుటుంబంలో కొత్త తరం ఎంట్రీగా దీనిని చూడటం జరుగుతోంది.
కానీ, మరో ప్రధాన ట్రస్ట్ అయిన సర్ రతన్ టాటా ట్రస్ట్ (SRTT) బోర్డులో మాత్రం నెవిల్లే నియామకం జరగలేదు. ఈ ట్రస్ట్‌కి చైర్మన్‌గా ఉన్న వేణు శ్రీనివాస్ నియామక విధానంపై అభ్యంతరం తెలిపినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. నియామక ప్రతిపాదన అజెండాలో లేకుండా సమావేశంలో ప్రవేశపెట్టడం సరైంది కాదన్న కారణంతో శ్రీనివాస్ ఆ ప్రతిపాదనను నిలిపివేసినట్టు సమాచారం. ఈ పరిణామం టాటా ట్రస్ట్స్‌లో అంతర్గత విభేదాలు మళ్లీ వెలుగులోకి వచ్చినట్లు అయింది.
నోయెల్ టాటా ట్రస్ట్స్‌ను ఏకీకృతంగా నడపడానికి ప్రయత్నిస్తున్నా, సీనియర్ ట్రస్టీల ప్రతిస్పందన ఆయనకు సవాల్‌గా మారినట్లు అనిపిస్తోంది. రెండు ప్రధాన ట్రస్టులు — SDTT (28% వాటా) మరియు SRTT (23.6% వాటా) — కలిపి టాటా సన్స్‌లో 51% కంటే ఎక్కువ వాటాను కలిగి ఉన్నాయి. ఈ రెండు సంస్థలు ఏకాభిప్రాయంతో వ్యవహరించకపోతే, టాటా గ్రూప్‌లో శక్తి సమీకరణం మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉంది. ఇక నెవిల్లే టాటా ఎంట్రీ ఈ సామ్రాజ్యానికి కొత్త ఆరంభమా? లేక కొత్త విభేదాల దిశగా అడుగులా? అన్నది కాలమే నిర్ణయించాలి.


