వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ
ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ
కాకతీయ, ఖమ్మం : ఖమ్మం నగర శివారు వెలుగుమట్లలో భూదాన్ భూములపై ప్రభుత్వం చేపట్టిన తొలగింపుల తర్వాత పునరావాస కేంద్రాలకు తరలించిన గుడిసెవాసులకు బీఆర్ఎస్ పార్టీ సహాయ చర్యలు కొనసాగిస్తోంది. రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో శనివారం అంబేద్కర్ భవన్, టిటిడిసి కేంద్రాల్లో బాధితులకు భోజనాలు పంపిణీ చేశారు. తమ గుడిసెలు తొలగించి పునరావాస కేంద్రాలకు తరలించినప్పటికీ తాగునీరు, భోజనం సక్రమంగా అందడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన ఆదేశాల మేరకు ఎంపీ రవిచంద్ర వెంటనే స్పందించి భోజనాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రెండు రోజులుగా తాగునీరు కూడా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పడంతో బీఆర్ఎస్ నాయకులు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేశారు. తమకు కడుపునిండా భోజనం పెట్టిన పార్టీ నాయకత్వానికి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం న్యాయం చేసేంత వరకు వెలుగుమట్ల బాధితులకు అండగా ఉంటామని బీఆర్ఎస్ నాయకులు భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


