సింగరేణిని బీఆర్ఎస్ దోచుకుంది
కొత్త ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తాం
కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి
కాకతీయ, రామకృష్ణాపూర్ : బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో సింగరేణి సంస్థను అన్ని విధాలుగా దోచుకుందని కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తీవ్ర ఆరోపణలు చేశారు. శుక్రవారం క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. మున్సిపాలిటీ పరిధిలోని 3, 19, 17, 20 వార్డుల్లో ప్రచారం నిర్వహించిన మంత్రి, ఈ ప్రాంత యువతకు కొత్త ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లలో శిక్షణ పొందిన ప్రతి ఒక్కరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాల హామీని తప్పకుండా నెరవేరుస్తామని ఛాలెంజ్‌గా చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలను ప్రజల విజ్ఞతకే వదిలేస్తున్నానని, వాటికి సమాధానం ప్రజలే చెబుతారని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, అభివృద్ధిని కొనసాగించాలంటే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.


