ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం
వారంలోగా అమల్లోకి..
మూడునాలుగు రోజుల్లోనే సంతకాలు
భారత్-అమెరికా సంయుక్త ప్రకటన
కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్
కాకతీయ, నేషనల్ డెస్క్: భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం తొలి దశ సిద్ధమైంది. దీనిపై మరో మూడునాలుగు రోజుల్లో సంతకాలు జరిగి, సంయుక్త ప్రకటన వెలువడనుంది. తర్వాతి ఒకటి రెండు రోజుల్లోనే (సుమారు వారం రోజుల్లో) భారత ఉత్పత్తులపై అమెరికా సుంకాల తగ్గింపు అమల్లోకి రానుంది. చట్టబద్ధ ఒప్పందాన్ని సిద్ధం చేయడానికి నెలా, నెలన్నర రోజులు పట్టవచ్చని.. మార్చి మధ్య నాటికి దానిపై సంతకాలు పూర్తయ్యే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ఆ తర్వాత అమెరికా ఉత్పత్తులపై భారత్లో సుంకాల తగ్గింపు అమల్లోకి వస్తుందని తెలిపారు. చట్టబద్ధ ఒప్పందం తర్వాత భారత్కు మరిన్ని మినహాయింపులు దక్కుతాయని, అందువల్ల ఒప్పందం ప్రక్రియను వేగంగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.
రూ.45 లక్షల కోట్ల దిగుమతులు పెద్ద విషయమేం కాదు
అమెరికా నుంచి రూ.45 లక్షల కోట్ల (500 బిలియన్ డాలర్ల) దిగుమతులకు అంగీకరించిన అంశంపై పీయూష్ గోయల్ స్పందిస్తూ.. ‘‘వేగంగా వృద్ధి చెందుతున్న భారత్కు భారీగా చమురు, డేటా సెంటర్లు, సమాచార రంగ పరికరాలు అవసరం. దానికి అదనంగా మన దేశానికి అవసరమైన విమానాల కోసం ఇప్పటికే చేసిన, ఇకపై చేయబోయే ఆర్డర్ల విలువే రూ.7.2 లక్షల కోట్ల (80 బిలియన్ డాలర్లు)కుపైగా ఉంటుంది. ఇక పాతవాటికి అవసరమైన ఇంజన్లు, విడిభాగాల ఖర్చును కలిపితే ఇది రూ.9లక్షల కోట్లు (100 బిలియన్లు) దాటుతుంది. భారత్ డేటా సెంటర్ల ఏర్పాటుకు ట్యాక్స్ హాలిడే ఇచ్చింది. దీనితో రూ.9 లక్షల కోట్ల నుంచి రూ.13.5 లక్షల కోట్ల మేర డేటా సెంటర్ల ఏర్పాటుకు పెట్టుబడులు వస్తే.. వాటికి సంబంధించిన పరికరాలను అమెరికా నుంచే దిగుమతి చేసుకుంటాం. ఇలాంటివన్నీ లెక్కిస్తే రూ.45 లక్షల కోట్ల దిగుమతులు పెద్ద విషయమేమీ కాదు..’’ అని పేర్కొన్నారు.


