సైబర్ ముఠాపై మళ్లీ ఉక్కుపాదం
మరో ఐదుగురు నిందితులు అరెస్ట్
బ్యాంకు మాజీ మేనేజర్ పాత్ర బహిర్గతం
టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా వల విసిరిన గుంపు
ఖాతాల దందాలో కమిషన్ లావాదేవీలు వెలుగులోకి
వివరాలు వెల్లడించిన సత్తుపల్లి ఏసీపీ వసుంధర యాదవ్
కాకతీయ, ఖమ్మం బ్యూరో : సైబర్ నేరంలో మోసపోయిన బాధితుడి ఫిర్యాదు మేరకు ఈ నెల 23న కేసు నమోదు చేసినట్లు సహాయ పోలీసు కమిషనర్ వసుంధర తెలిపారు. ఇప్పటికే ఈ నెల 24న పద్నాలుగు మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. పరారీలో ఉన్న వారిపై ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టగా, సత్తుపల్లి ఇన్‌స్పెక్టర్ టి. శ్రీహరి ఆధ్వర్యంలో గురువారం మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. అరెస్టైన వారిలో ఇస్లావత్ లక్ష్మి కల్యాణ్, భూక్యా తరుణ్, బిల్లా సాయి తరుణ్, సంగెం ప్రవీణ్ కుమార్, వీరంశెట్టి వంశీ ఉన్నారు. అలాగే 2023లో కేథలిక్ సిరియన్ బ్యాంక్ చంద్రుగొండ శాఖలో మేనేజర్‌గా పనిచేసిన అఖీల్ అబ్దుల్‌ను కూడా అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఖాతాల తెరవడంలో నిబంధనలు పాటించకుండా సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయని చెప్పారు.
టెలిగ్రామ్ వలలో పడేసిన బాధితులు
ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన అడపా రామ వెంకట చరణ్ చౌదరి అలియాస్ చరణ్, ఉడతనేని వికాస్ చౌదరి, బొప్పన నాగప్రియ తదితరులు మ్యాట్రిమోనీ, రివార్డు పాయింట్లు, గేమింగ్, బెట్టింగ్, షేర్ మార్కెట్ పెట్టుబడులు, క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ పేర్లతో ప్రజలను ఆకర్షించినట్లు విచారణలో తేలింది. అధిక లాభాల ఆశ చూపిస్తూ బాధితులను టెలిగ్రామ్ గ్రూపుల్లో చేర్చి డబ్బులు మళ్లించుకున్నట్లు పోలీసులు గుర్తించారు. పెట్టుబడులు పెట్టిన తర్వాత మరింత లాభం వస్తుందని నమ్మబలికి మోసాలకు పాల్పడినట్లు వెల్లడించారు.
ఖాతాల దందాలో బ్యాంకు సంబంధాలు
మోసాలకు అవసరమైన బ్యాంకు ఖాతాల కోసం ఇస్లావత్ లక్ష్మి కల్యాణ్ ద్వారా కొన్ని ఖాతాలు పొందడంతో పాటు అతని పరిచయస్తుల పేర్లతో కూడా ఖాతాలు తెరవించినట్లు దర్యాప్తులో బయటపడింది. ఈ ప్రక్రియలో అప్పటి బ్యాంకు మేనేజర్ అఖీల్ అబ్దుల్‌తో కుమ్మక్కై కమిషన్ ఇచ్చి ఖాతాలు తెరవించినట్లు పోలీసులు పేర్కొన్నారు. సరైన విధానాలు పాటించకుండా ఖాతాలు ప్రారంభించడం ద్వారా మోసాలకు మార్గం సుగమం చేసినట్లు అనుమానిస్తున్నారు. అరెస్టు చేసిన నిందితులను రిమాండ్‌కు తరలించగా, కేసు దర్యాప్తు కొనసాగుతోందని సహాయ పోలీసు కమిషనర్ వసుంధర తెలిపారు. ముఠాకు సంబంధించిన మరిన్ని వివరాలు, డబ్బుల లావాదేవీలపై పూర్తి సమాచారం త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు.


