బట్టీల్లో నలిగిపోతున్న బాల్యం
ఇటుక బట్టిల్లో నిబంధనలకు తిలోదకాలు
వసతుల్లేని వలస జీవనం.. దుర్భర పరిస్థితులు
ధనార్జనే ధ్యేయంగా బట్టీల నిర్వాహకుల ఆగడాలు
నిద్రావస్థలో పెద్దపల్లి జిల్లా అధికార యంత్రాంగం
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : బతుకుదెరువు కోసం స్వగ్రామాలను విడిచిపెట్టి వచ్చిన వలస కార్మికులు ఇటుక బట్టీల మధ్య నలిగిపోతున్నారు. తాగునీరు, వైద్య సదుపాయాలు, నివాస వసతులు లేని పరిస్థితుల్లో కుటుంబాలతో సహా బట్టీల్లోనే జీవనం సాగిస్తున్నారు. మరోవైపు చదువుకోవాల్సిన వయసులోని పిల్లలను ఇటుక తయారీ పనుల్లోకి దింపుతూ బట్టీల నిర్వాహకులు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ దుస్థితిని అరికట్టాల్సిన రెవెన్యూ, మైనింగ్, పోలీస్, ఇరిగేషన్, కార్మిక శాఖలు మాత్రం మౌనంగా ఉండటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా సుమారు 200కు పైగా ఇటుక బట్టీలు కొనసాగుతున్నట్లు అంచనా. వీటిలో ఎక్కువ శాతం బట్టీలు అనుమతులు, పర్యవేక్షణ లేకుండానే సీజనల్ పేరుతో కొనసాగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. బీహార్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు కుటుంబాలతో సహా బట్టీల వద్దే తాత్కాలిక షెడ్లలో నివసిస్తున్నారు. తాగునీరు, మరుగుదొడ్లు, వైద్య సదుపాయాలు లేని పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారు.
బట్టీల్లో మగ్గుతున్న బాల్యం
చిన్నచేతులు పుస్తకాలు పట్టాల్సిన వయసులో ఇటుకల మట్టిని మోస్తూ, ఎండలో పని చేస్తూ కనిపిస్తున్నాయి. బాల కార్మిక నిషేధ చట్టం ప్రకారం ఇటుక బట్టీలు ప్రమాదకర పనుల విభాగంలోకి వస్తాయి. 14 ఏళ్ల లోపు పిల్లలతో పని చేయించడం పూర్తిగా నిషేధం. 14 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న కిశోరులను కూడా ఇటుక తయారీ వంటి ప్రమాదకర పనుల్లో పెట్టడం చట్టవిరుద్ధమే. అయినా జిల్లాలో ఈ చట్టాలు కాగితాలకే పరిమితమవుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. బాల కార్మికులతో పని చేయిస్తే 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు జరిమానా విధించాల్సి ఉంటుంది. పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకోవాల్సిన నిబంధనలు ఉన్నాయి. అయినా జిల్లాలో ఒక్క బట్టీపై కూడా కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు అరుదుగా కనిపిస్తున్నాయి. కార్మిక శాఖ అధికారులు బాల కార్మికుల వైపు కన్నెత్తి చూడకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
ధనార్జనే ధ్యేయం
ఇటుక బట్టీల నిర్వాహకులు లాభాలే లక్ష్యంగా చట్టాలు, మానవత్వాన్ని పక్కనపెట్టి వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. వలస కార్మికుల పేదరికాన్ని ఆసరాగా చేసుకుని వెట్టి చాకిరికి నెట్టడం సాధారణమైందన్న విమర్శలు ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో బట్టీ యజమానుల అగడాలకు హద్దే లేకుండా పోతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో గౌరెడ్డిపేట ప్రాంతంలో ఇటుక బట్టీలో ఒడిశాకు చెందిన వలస కార్మికులపై జరిగిన అమానుష ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అలాగే బట్టీల వద్ద ఫుడ్ పాయిజన్ ఘటనల్లో ఇద్దరు మృతి చెందడం, పలువురు అస్వస్థతకు గురికావడం కూడా నిర్వాహకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచాయి. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కొద్ది రోజులు నిఘా పెంచిన అధికారులు ఆ తర్వాత మళ్లీ మౌనం వహిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా ఇటుక బట్టీలపై సమగ్ర తనిఖీలు చేపట్టి, బాల కార్మికులను విముక్తి చేసి, నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఈ దోపిడీ కొనసాగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.


