మల్కాజిగిరిలో హెల్మెట్ అవగాహన డ్రైవ్
కాకతీయ, మేడ్చల్–మల్కాజిగిరి: మల్కాజిగిరి పరిధిలోని నేరేడ్మెట్ వాయుపురి ప్రాంతంలో సోమవారం ద్విచక్ర వాహనదారుల కోసం హెల్మెట్‌పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అవినాష్ మహంతి సూచనల మేరకు రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ట్రాఫిక్ డీసీపీ తెలిపారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న రైడర్లను పోలీసులు ఆపి ముందుగా కౌన్సిలింగ్ నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల సమయంలో హెల్మెట్ ప్రాణాలను ఎలా కాపాడుతుందో వివరించారు. అనంతరం ‘హెల్మెట్ బ్యాంక్’ ద్వారా తాత్కాలికంగా హెల్మెట్‌లు అందజేశారు.
సాయంత్రం వరకు వాటిని వినియోగించి, కొత్త హెల్మెట్ కొనుగోలు చేసిన తర్వాత తీసుకున్న హెల్మెట్‌ను తిరిగి జమ చేయాలని సూచించారు. ఈ విధానం ద్వారా వాహనదారుల్లో బాధ్యతాయుతమైన ప్రవర్తన పెంపొందించడమే లక్ష్యమని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో కొనసాగించనున్నట్లు పోలీసులు వెల్లడించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ డీసీపీ, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు పాల్గొన్నారు.



