భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు
పేదల పేరుతో రాద్ధాంతం చేశారు
ఏజెంట్ల మోసాలపై బాధితులకు న్యాయం చేస్తాం
తుమ్మలపై బురదజల్లే కుట్రలు విఫలం
ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి
కాకతీయ, ఖమ్మం : భూదాన్ భూముల వ్యవహారంలో ప్రతిపక్ష పార్టీలు అభాసుపాలై కూడా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేయడం సరికాదని ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి విమర్శించారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన విపక్షాలపై ఘాటుగా స్పందించారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా పేదల పేరుతో రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. పేదల ఇండ్ల కంటే బడాబాబుల ఇండ్లే ఎక్కువగా ఉన్న విషయం బయటపడటంతో విపక్షాలు ఇబ్బందిలో పడ్డాయని వ్యాఖ్యానించారు. ఏజెంట్లు లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేసిన కేసుల్లో బాధితుల పక్షాన నిలిచి న్యాయం చేస్తామని తెలిపారు. రెండు సంవత్సరాల్లో ఖమ్మం అభివృద్ధి దిశగా వేల కోట్ల రూపాయల పనులు జరిగాయని, ఖిల్లా నుంచి నరసింహ స్వామి గుట్ట వరకు రోప్‌వే, తీగల బ్రిడ్జి, స్టేడియం, విద్యాసంస్థలు, మార్కెట్లు వంటి ప్రాజెక్టులు పురోగమిస్తున్నాయని పేర్కొన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై రాజకీయ అక్కసుతో ఆరోపణలు చేయడం తగదన్నారు. నిజమైన పేదలకు ఇండ్లు ఇవ్వడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని, బురదజల్లే ప్రయత్నాలు చేసినవారే బురదలో కూరుకుపోతారని దీపక్ చౌదరి హెచ్చరించారు.


