హుజూరాబాద్‌లో
బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం
కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్
కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు, ప్రవర్తనపై తీవ్ర విమర్శలు
కేసులపై సీఐడీ విచారణకు డిమాండ్
కాకతీయ, హుజూరాబాద్ : హుజూరాబాద్ గడ్డపై బీఆర్‌ఎస్ పార్టీ భూస్థాపితం కావడం ఖాయమని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. కౌశిక్ రెడ్డి వ్యక్తిగత ఇమేజ్ కోసం చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. శనివారం హుజూరాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ఐదు మండలాలకు చెందిన 98 మంది లబ్ధిదారులకు రూ.36 లక్షల చెక్కులను పంపిణీ చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కౌశిక్ రెడ్డి చేస్తున్న ఆరోపణల్లో ఒక్కటీ నిజం లేదని, అధికారులను దూషించడం, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ప్రజల కోసం ఉద్యమాలు చేస్తే కేసులు పెట్టలేదని, వ్యాపారులు, ఇసుక క్వారీ యజమానులను బెదిరిస్తూ అక్రమాలకు పాల్పడిన కారణంగా బాధితులే పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమపాళ్లలో అమలు చేస్తున్నామని ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు ఇచ్చారన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం జీర్ణించుకోలేక కౌశిక్ రెడ్డి అనవసర ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.
సీఎంపై వ్యాఖ్యలు సహించం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనవసర వ్యాఖ్యలు చేస్తే సహించబోమని వొడితల ప్రణవ్ హెచ్చరించారు. పెద్ద నాయకులతో పోల్చుకుంటే పెద్దవాడినవుతానని కౌశిక్ రెడ్డి పగటి కలలు కంటున్నారని విమర్శించారు. గతంలో రాష్ట్రాన్ని పాలించిన బీఆర్‌ఎస్ నాయకులపై ప్రజలు ఇప్పటికే తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. వీణవంక సమ్మక్క, సారలమ్మ జాతర సందర్భంగా పోలీసులపై కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరాధారమని హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు విధులు నిర్వహించారని తెలిపారు. మహిళా అధికారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆయన సంస్కారానికే వదిలేస్తున్నామని విమర్శించారు. మతం పేరుతో కరీంనగర్ సీపీపై దూషణలు చేసిన విషయం నిజం కాదా అని ప్రశ్నించిన ప్రణవ్ ఈ అంశంపై బీఆర్‌ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావు తమ పార్టీ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో హుజూరాబాద్ మున్సిపల్ చైర్మన్ సుహాసిని, వైస్ చైర్మన్ అంజలి, కౌన్సిలర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, దేవాలయ కమిటీ చైర్మన్లు, మండల, పట్టణ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


