బాలల సృజనకు బంగారు బాట
పీఎం శ్రీ కూసుమంచి పాఠశాలలో సైన్స్ ఎక్స్‌పో
వందకు పైగా వినూత్న నమూనాలు ప్రదర్శన
స్మార్ట్ విలేజ్, సోలార్ మోడళ్లకు ప్రశంసలు
కాకతీయ, కూసుమంచి : చిన్నారుల చిట్టిబుర్రల్లో దాగిన ప్రతిభ శనివారం వెలుగుచూసింది. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా పీఎం శ్రీ కూసుమంచి ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సైన్స్ ఎక్స్‌పో ఆకట్టుకుంది. వందకు పైగా నమూనాలను విద్యార్థులు స్వయంగా తయారు చేసి ప్రదర్శించారు. ప్రతి మోడల్ వెనుక శాస్త్రీయ ఆలోచన ప్రతిబింబించింది. సోలార్ ఎనర్జీ ప్రాజెక్టులు, రోబోటిక్ నమూనాలు, జేసీబీ మోడల్, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన వర్కింగ్ మోడళ్లు సందర్శకులను ఆకర్షించాయి. ప్రత్యేకంగా రూపొందించిన స్మార్ట్ విలేజ్ నమూనా గ్రామీణాభివృద్ధి దిశగా విద్యార్థుల ఆలోచనా పరిపక్వతను చూపించింది. కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయులు, ఎంఈవో రాయల వీరస్వామి ప్రారంభించి ప్రదర్శనలు పరిశీలించారు. విద్యార్థుల సృజనాత్మకతను అభినందించారు. “ఎందుకు? ఎలా?” అని ప్రశ్నించే తత్వమే సైన్స్ నేర్పుతుందని, నిత్యజీవితంలో సైన్స్‌ను అన్వయించుకోవాలని సూచించారు. విజేతలకు బహుమతులు అందజేశారు.


