పామాయిల్ మొక్కలను పట్టించుకోరా?
ఐటీడీఏ ఉద్యానవనంలో అధికారుల నిర్లక్ష్యం
గిరిజన రైతుల ఆవేదన
కాకతీయ, ఏటూరునాగారం : గిరిజనుల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం లక్షల రూపాయలు వెచ్చించి మండల కేంద్రంలో ప్రారంభించిన పామ్ ఆయిల్ మొక్కల పెంపకం అధికారుల నిర్లక్ష్యంతో నిరుపయోగంగా మారుతోంది. 2023 సంవత్సరంలో అప్పటి ఐటీడీఏ పీవో అంకిత్ ఆధ్వర్యంలో గిరిజన రైతులకు పామ్ ఆయిల్ సాగుపై అవగాహన సదస్సులు నిర్వహించి, ఉచితంగా మొక్కలను పంపిణీ చేశారు. అదే సమయంలో ఐటీడీఏ పరిధిలోని ఉద్యానవనంలో సుమారు 9.5 ఎకరాల విస్తీర్ణంలో రూ.50 లక్షల వ్యయంతో పామ్ ఆయిల్ మొక్కల పెంపకం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే అప్పటినుంచి ఇప్పటివరకు ఈ ఉద్యానవనాన్ని సంబంధిత అధికారులు పర్యవేక్షించకపోవడం గమనార్హం. మొక్కలకు తగిన నీటి సౌకర్యం లేకపోవడం, కంచ ఏర్పాటు చేయకపోవడంతో పశువులు, మేకలు మొక్కలను మేస్తుండటంతో అనేక పామ్ ఆయిల్ మొక్కలు ఎండిపోయి నశించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఐటీడీఏ పీవో గానీ, సంబంధిత అధికారులు గానీ ఉద్యానవనాన్ని తనిఖీ చేసిన దాఖలాలులేవని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ లక్ష్యాలతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురికావడం వల్ల గిరిజన రైతుల్లో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఉద్యానవనాన్ని తనిఖీ చేసి, పామ్ ఆయిల్ మొక్కలకు నీరు, కంచ, సరైన సంరక్షణ కల్పించి ప్రాజెక్టును పునరుద్ధరించాలని గిరిజన రైతులు, స్థానికులు కోరుతున్నారు.



