ఘనంగా టైలర్స్ డే
కాకతీయ,నర్సంపేట టౌన్: నర్సంపేట పట్టణంలో టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘ప్రపంచ టైలర్స్ డే’ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు గట్ల శ్రీనివాస్ జెండా ఆవిష్కరించి టైలర్లకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… కుట్టు కళకు గౌరవం తెలిపే ప్రత్యేక దినోత్సవమే టైలర్స్ డే అన్నారు. దుస్తులు అందంగా, సౌకర్యంగా తయారయ్యే వెనుక టైలర్ల కష్టాన్ని చాలా మంది గుర్తించరని పేర్కొన్నారు. తమ వృత్తిని నిబద్ధతతో నిర్వహిస్తూ ప్రజల అవసరాలకు అనుగుణంగా దుస్తులను రూపొందించే టైలర్ల సేవలు సమాజానికి ఎంతో విలువైనవని తెలిపారు. ఆధునిక టైలర్లు కేవలం కుట్టు పనికే పరిమితం కాకుండా ఫ్యాషన్ డిజైన్, ప్యాటర్న్ మేకింగ్, ఎంబ్రాయిడరీ, స్టైలింగ్ సూచనలు వంటి అనేక రంగాల్లో తమ నైపుణ్యాన్ని చాటుతున్నారని వివరించారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు రామగిరి రవి, పైతర్ వెంకటేష్, ప్రధాన కార్యదర్శి న్యాతిని రవి, కోశాధికారి రామగిరి రవి, కార్యవర్గ సభ్యులు ప్రకాష్, కమిటీ సభ్యులు కర్ణ కృష్ణ, మధు, సంగ సత్యనారాయణ, సాయి బాబా, గట్ల రాంచందర్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.


