డ్రైవర్ల చేతుల్లోనే ప్రజల ప్రాణాలు
కంటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి.గితే
సిరిసిల్ల, వేములవాడల్లో ఉచిత నేత్ర వైద్య శిబిరాలు
కాకతీయ, సిరిసిల్ల టౌన్: రోడ్డు ప్రమాదాల నివారణను ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరైవ్–ఆలైవ్ కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో పోలీసులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… స్పష్టమైన దృష్టి, నియంత్రిత వేగం, ట్రాఫిక్ నియమాల కచ్చితమైన పాటింపే సురక్షిత డ్రైవింగ్‌కు మూలాధారమని తెలిపారు. ప్రతి వాహనదారుడు క్షేమంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. వయస్సు పెరుగుతున్న కొద్దీ కంటి చూపు మందగించడం సహజమని, ముఖ్యంగా ప్రయాణికులను తరలించే ప్యాసింజర్ వాహనాల డ్రైవర్లు తమ కంటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల ప్రాణ భద్రత డ్రైవర్ల చేతుల్లోనే ఉంటుందని, అందువల్ల కంటి పరీక్షలను నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు. కంటి సమస్యలతో వాహనం నడిపితే ప్రమాదాల అవకాశాలు పెరుగుతాయని హెచ్చరిస్తూ, డ్రైవర్లు నిరంతరం వైద్య పరీక్షలు చేయించుకోవాలని పిలుపునిచ్చారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, అతివేగం, ఓవర్ లోడింగ్, ర్యాష్ డ్రైవింగ్, సెల్‌ఫోన్ ఉపయోగిస్తూ వాహనం నడపడం వంటి ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పరీక్షల అనంతరం అవసరమైన డ్రైవర్లకు ఎస్పీ స్వయంగా కంటి అద్దాలు అందజేశారు. వేములవాడ ఏఎస్పీ రుత్విక్ సాయి, డీఎస్పీ నాగేంద్రచారి, ఇన్స్పెక్టర్లు కృష్ణ, వీరప్రసాద్, ఎస్‌ఐలు, డాక్టర్ చికోటి సంతోష్, లయన్స్ క్లబ్ సభ్యులు, డ్రైవర్లు పాల్గొన్నారు.


