వెలుగుమట్ల భూదాన్ భూములపై సర్వే ప్రారంభం
తొలగించిన ఇండ్లవారి సామాజిక–ఆర్థిక స్థితి పరిశీలన
14 మంది తహశీల్దార్లకు కలెక్టర్ ఆదేశాలు
అర్హులైన పేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని స్పష్టం
కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల గ్రామంలో భూదాన్ భూముల ఆక్రమణలో భాగంగా ఈ నెల 24న తొలగించబడిన ఇండ్లకు సంబంధించిన వ్యక్తులపై సామాజిక, ఆర్థిక సర్వేను వెంటనే ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వెల్లడించారు. ఈ మేరకు జిల్లాలోని 14 మంది తహశీల్దార్లకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. సర్వే ప్రక్రియను అత్యంత వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించిన కలెక్టర్, ప్రతి కుటుంబం యొక్క ఆర్థిక స్థితి, సామాజిక పరిస్థితులు, అర్హత అంశాలను సమగ్రంగా నమోదు చేయాలని పేర్కొన్నారు. సర్వే పూర్తయిన అనంతరం అర్హులైన పేదలకు ప్రభుత్వ విధానాల ప్రకారం నివాస స్థల పట్టాలు లేదా ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుకు చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. నిజంగా ఇల్లు లేని, అర్హత కలిగిన నిరుపేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. తొలగించబడిన ఇండ్లకు సంబంధించిన వ్యక్తులు తమ తమ గ్రామాల్లో అందుబాటులో ఉండి సర్వే బృందాలకు పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. సమగ్ర నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.


