ఏసీబీ వలలో మంథని సబ్‌రిజిస్ట్రార్
భూమి రిజిస్ట్రేషన్‌కు రూ.16,500 లంచం డిమాండ్
డాక్యుమెంట్ రైటర్ ద్వారా వసూళ్లు
రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు
కాకతీయ కథనాలకు ముద్ర వేసిన ఏసీబీ రైడ్
కాకతీయ, కరీంనగర్ బ్యూరో: ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి ఎలా రాజ్యమేలుతోందో బయటపెట్టిన ఘటన పెద్దపల్లి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. భూమి రిజిస్ట్రేషన్‌కు లంచం ఇవ్వకపోతే పని జరగదన్నట్టుగా వ్యవహరిస్తూ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న మంథని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి వ్యవహారం బహిర్గతమైంది. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల మేరకు ఫిర్యాదుదారుడు కొనుగోలు చేసిన భూమి రిజిస్ట్రేషన్‌కు అనుకూలంగా పని చేయడానికి మంథని సబ్‌రిజిస్ట్రార్ కాసర్ల రాజేందర్ రూ.16,500 లంచం డిమాండ్ చేశాడు. ఈ లంచాన్ని ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ రషీద్ ద్వారా స్వీకరిస్తుండగా ఏసీబీ కరీంనగర్ యూనిట్ అధికారులు ఆకస్మికంగా దాడి చేసి రెడ్ హ్యండడ్ గా పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అధికార బాధ్యతలను పక్కనబెట్టి అనుచిత లాభం కోసం విధులను అక్రమంగా నిర్వహించినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఈ వ్యవహారంలో సబ్‌రిజిస్ట్రార్ కాసర్ల రాజేందర్‌తో పాటు డాక్యుమెంట్ రైటర్ రషీద్‌ను అరెస్ట్ చేసి కరీంనగర్ ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరిచినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని ఫిర్యాదుదారుడి వివరాలను భద్రతా కారణాల రీత్యా గోప్యంగా ఉంచినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు ప్రజలకు సూచించారు.
కాకతీయ కథనాలకు ముద్ర వేసిన ఏసీబీ రైడ్
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో జరుగుతున్న అక్రమాలపై ఇటీవల కాకతీయ దినపత్రిక వరుస కథనాలుగా వెలుగులోకి తెచ్చిన అంశాలకు ఈ ఏసీబీ దాడి బలమైన నిర్ధారణగా నిలిచింది. “ఫైల్ మీద పైకం”, “రేటు మాట్లాడితేనే రూట్ క్లియర్”, “వసూళ్లలో నో కాంప్రమైజ్”, “ఆర్వో ఆఫీసే వసూళ్ల అడ్డా” అంటూ ప్రచురించిన కథనాల్లో పేర్కొన్న ఆరోపణలకు అనుగుణంగా మంథని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి బండారం బయటపడటం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.


