క్రీడల్లో మెరిసిన విద్యార్థులకు అభినందనలు
అగ్నివీర్ శిక్షణకు ఆహ్వానం
జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
కాకతీయ, పెద్దపల్లి : జిల్లాలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహిస్తూ, యువతకు ఉపాధి అవకాశాల దిశగా అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో క్రీడల్లో మెరుగైన ప్రతిభ కనబరిచిన సి.డబ్ల్యూ.ఎస్.ఎన్ విద్యార్థులను అభినందించారు.విద్యాశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో పెద్దపల్లి జిల్లాకు చెందిన 20 మంది విద్యార్థులు పాల్గొని ప్రతిభ చాటారు. జూలపల్లి మండలానికి చెందిన బడుగు సందీప్ జిగ్‌జాగ్ వాకింగ్‌లో ప్రథమ స్థానం సాధించగా, కమాన్‌పూర్‌కు చెందిన ఎడునూరి పౌర్ణమి చెస్‌లో మొదటి స్థానం దక్కించుకుంది. రొంపికుంటకు చెందిన కటకం శ్రీరామ్ చరణ్ పరుగుపందెంలో ప్రథమ స్థానం, మ్యూజికల్ చైర్‌లో ద్వితీయ స్థానం, జిగ్‌జాగ్ వాకింగ్‌లో ద్వితీయ స్థానం సాధించాడు.విజేతలను జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, జిల్లా విద్యాశాఖ అధికారి జి.శారద అభినందించారు. ఈ కార్యక్రమంలో ఐఈ కోఆర్డినేటర్ కవిత తదితరులు పాల్గొన్నారు.
అగ్నివీర్ శిక్షణకు అవకాశం
ఇదే సందర్భంలో యువతకు సైన్యంలో చేరేందుకు అవకాశాలను కల్పించే దిశగా “అగ్నివీర్ యూపీహెచ్‌ఎస్ శిక్షణ పథకం–2026”ను అమలు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులకు 90 రోజులపాటు ఉచిత శిక్షణ అందించనున్నారు.ఈ శిక్షణలో శారీరక వ్యాయామం, రాత పరీక్ష కోచింగ్, మెడికల్ అవగాహన, గ్రౌండ్ ప్రాక్టీస్, స్టడీ మెటీరియల్ వంటి సౌకర్యాలు కల్పించబడతాయి.ఫిబ్రవరి 23లోపు ఆసక్తిగల యువత రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ఫిబ్రవరి 25న మెడికల్ పరీక్షల ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని తెలిపారు. మార్చి 1 నుంచి మే 31 వరకు శిక్షణ నిర్వహించనున్నారు.పెద్దపల్లి జిల్లాకు చెందిన పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు వయస్సు 17.5 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు ఆధార్ కార్డు, పదో తరగతి మెమో, రెండు ఫోటోలు తీసుకుని రుద్రమదేవి స్టేడియం, రామగిరి వద్ద ఉదయం 6 నుంచి 8 గంటల మధ్య హాజరుకావాలని సూచించారు.మరిన్ని వివరాలకు 9573688952, 9949725997, 8106807784 నంబర్లను సంప్రదించాలని అధికారులు తెలిపారు.


