జీవన్ రెడ్డి ఆరోగ్యంపై కీలక ప్రకటన
కాకతీయ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి ఆరోగ్యంపై వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన అనుచరులు, పార్టీ శ్రేణులకు స్పష్టత ఇచ్చారు. జీవన్ రెడ్డి గారు ఎలాంటి అస్వస్థతకు గురికాలేదని, సాధారణ మెడికల్ చెకప్‌లో భాగంగానే ఆస్పత్రికి వెళ్లినట్లు తెలిపారు. రెగ్యులర్ ఆరోగ్య పరీక్షల కోసం ముందస్తు ప్రణాళిక ప్రకారం ఆస్పత్రిని సందర్శించినట్లు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం జీవన్ రెడ్డి గారు పూర్తిగా ఆరోగ్యంగానే ఉన్నారని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని పేర్కొన్నారు. జీవన్ రెడ్డి ఆరోగ్యంపై వస్తున్న వివిధ ప్రచారాలను నమ్మవద్దని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అనుచరులు విజ్ఞప్తి చేశారు. మాజీ మంత్రి త్వరలోనే తన సాధారణ కార్యకలాపాల్లో పాల్గొంటారని, ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలిపారు.


