*మేజర్ పంచాయతీ పేరుకేనా? *
*ఏటూరునాగారం ఆళ్లగడ్డలో మురుగునీరు ఎన్ హెచ్ ఎం రోడ్డుపైకి*
కాకతీయ, ఏటూరునాగారం : ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఆళ్లగడ్డ ప్రాంతంలో మురుగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో మురుగునీరు నేరుగా ఎన్ హెచ్ ఎం రహదారిపైకి వచ్చి చేరుతోంది.పేరుకు మాత్రమే మేజర్ గ్రామపంచాయతీగా ఉన్నప్పటికీ, ప్రాథమిక సదుపాయాల నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రోడ్డుపై నిల్వ ఉన్న మురుగునీటితో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుర్వాసనతో పాటు అంటువ్యాధుల ముప్పు కూడా ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.



