రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ
సాధారణ యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు లేవు
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు అసత్యమని స్పష్టం
వాలెట్ లావాదేవీలకు మాత్రమే ప్రత్యేక నిబంధనలు వర్తింపు
పిన్ వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని హెచ్చరిక
కాకతీయ, నేషనల్ బ్యూరో : దేశవ్యాప్తంగా యూపీఐ (UPI) ద్వారా డిజిటల్ చెల్లింపులు విస్తృతంగా పెరుగుతున్న నేపథ్యంలో రూ.1000 దాటితే ఛార్జీలు కట్ అవుతాయన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) స్పష్టం చేసింది. వ్యక్తి నుంచి వ్యక్తికి (P2P), వ్యక్తి నుంచి వ్యాపారికి (P2M) బ్యాంక్ ఖాతా నుంచి బ్యాంక్ ఖాతాకు నేరుగా జరిగే యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదని ఎన్‌పీసీఐ తెలిపింది. రూ.1000 మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువ మొత్తాలకు కూడా సాధారణ వినియోగదారులపై ఛార్జీలు ఉండవని పేర్కొంది.
గందరగోళానికి కారణం వాలెట్ లావాదేవీలు
కొన్ని యూపీఐ యాప్‌లలో (ఫోన్‌పే, పేటీఎం, అమెజాన్ పే వంటి) వాలెట్‌లో డబ్బు లోడ్ చేసి, అక్కడి నుంచి వ్యాపారులకు చెల్లింపులు చేసే సందర్భాల్లో మాత్రమే కొన్ని ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. ముఖ్యంగా రూ.2000కు పైగా వాలెట్ ద్వారా చెల్లింపులు చేస్తే వ్యాపారులకు మాత్రమే చార్జీలు వర్తించవచ్చు. అయితే ఈ రుసుమును వినియోగదారులు భరించాల్సిన అవసరం లేదని ఎన్‌పీసీఐ స్పష్టం చేసింది. ప్రస్తుతం యూపీఐ ద్వారా సాధారణ వినియోగదారులు రోజుకు రూ.1 లక్ష వరకు లావాదేవీలు చేయవచ్చు. ఆసుపత్రులు, విద్యాసంస్థలు వంటి కొన్ని ప్రత్యేక విభాగాలకు రూ.5 లక్షల వరకు చెల్లింపులు చేసే అవకాశం కూడా ఉంది.
మోసాలపై జాగ్రత్త అవసరం
యూపీఐ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులు తమ యూపీఐ పిన్‌ను ఎవరితోనూ పంచుకోవద్దని అధికారులు సూచించారు. తెలియని లింకులు, అనుమానాస్పద కాల్స్‌పై స్పందించకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే దిశగా యూపీఐ సేవలను ఉచితంగా కొనసాగిస్తున్నట్లు ఎన్‌పీసీఐ వెల్లడించింది.


