లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మాదాపూర్ ఎస్‌ఐ
రూ.50 వేలు డిమాండ్… ఏసీబీ ట్రాప్‌లో రెడ్‌హ్యాండెడ్‌గా అరెస్ట్
కాకతీయ, హైదరాబాద్: మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో అవినీతి వ్యవహారం వెలుగుచూసింది. ఓ సివిల్ కేసులో ఫిర్యాదుదారుడికి అనుకూలంగా వ్యవహరించేందుకు రూ.50 వేల లంచం డిమాండ్ చేసిన సబ్ ఇన్‌స్పెక్టర్ వినయ్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన నగర పోలీసు వర్గాల్లో కలకలం రేపుతోంది.
ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ
బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు పక్కా వ్యూహంతో ట్రాప్ నిర్వహించారు. సోమవారం ఎస్‌ఐ వినయ్ లంచం మొత్తాన్ని స్వీకరిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. వెంటనే రసాయన పరీక్షలు నిర్వహించగా నగదు తాకిన ఆనవాళ్లు స్పష్టంగా బయటపడినట్లు అధికారులు తెలిపారు. లంచం నగదును స్వాధీనం చేసుకుని ఎస్‌ఐను అదుపులోకి తీసుకున్నారు.
కోర్టులో హాజరు… కఠిన చర్యలు
అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి, నిందిత ఎస్‌ఐను ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచే ప్రక్రియ చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేసిన సందర్భాల్లో ప్రజలు భయపడకుండా వెంటనే ఏసీబీని ఆశ్రయించాలని సూచించారు.
అవినీతికి సంబంధించిన ఫిర్యాదుల కోసం ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు సమాచారం ఇవ్వాలని అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వ వ్యవస్థల్లో పారదర్శకత కోసమే ఇలాంటి చర్యలు కొనసాగుతాయని పేర్కొన్నారు.


